సైన్యం, పోలీసుల నుంచి తమకు ప్రతిఘటన ఎక్కువ కావడంతో ఉగ్రవాదులు కొత్త ఎత్తు వేశారు. అందమైన అమ్మాయిలతో యువతను ఆకర్షించి వారిని ఉగ్రవాదం వైపు లాగుతున్నారు. బందిపొరాకు చెందిన సయ్యద్ షాజియా అనే మహిళను పోలీసులు అరెస్ట్ చేయగా.. విచారణలో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి.

కశ్మీర్ యువతను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి పాకిస్తాన్‌లోని ఉగ్రవాద సంస్థలు అందమైన అమ్మాయిలను ఎరగా ఉపయోగించుకుంటున్నాయని తెలిపింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం వంటి సామాజిక మాధ్యమాల్లో నకిలీ పేర్లతో ఖాతాలను సృష్టించి ఇక్కడి యువతతో పరిచయం పెంచుకుంటారని.. అనంతరం తాము చెప్పిన పని చేస్తేనే కలుస్తామని చెబుతారని వెల్లడించింది.

తన వలలో పడిన కొందరు యువకులు తాను చెప్పినట్లుగా ఆయుధాలను రవాణా చేయడం, ఉగ్రవాదులకు దారి చూపడం వంటి పనులు చేశారని తెలిపింది. తనో పాటు చాలా మంది అందమైన అమ్మాయిలు ఉగ్రవాదుల కోసం పనిచేస్తున్నట్లుగా షాజియా వెల్లడించింది.

ఈ వ్యవహారంలో ఆమెకు పలు కీలక విషయాలు చెప్పిన పోలీస్ అధికారిని కూడా అరెస్ట్ చేశామని ఉన్నతాధికారులు తెలిపారు. షాజియా నుంచి గ్రెనేడ్లు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకోవడంతో పాటు ఇద్దరు సోదరులను కూడా అదుపులోకి తీసుకున్నారు.