దేశంలో ప్రభుత్వాసుపత్రులు దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఎన్నో ప్రాంతాల్లో దవాఖానాలు శిథిలావస్థకు చేరుకోగా.. కొన్ని చోట్ల సిబ్బంది కొరత వేధిస్తోంది. తాజాగా మధ్యప్రదేశ్‌‌లోని ఓ ప్రభుత్వాసుపత్రిలో స్త్రీ, పురుషులు ఇద్దరినీ ఒకే మంచంపై వుంచి చికిత్స అందించడం కలకలం రేపింది.

వివరాల్లోకి వెళితే.. ఇండో‌ర్‌లోని ఎంవై ఆసుపత్రిలోని ఆర్థో వార్డులో స్ట్రెచర్ లేని కారణంగా వేర్వేరు కుటుంబాలకు చెందిన స్రీ, పురుషులను ఒకే మంచంపై పడుకోబెట్టి వైద్య పరీక్షలకు తరలించారు.

ఆ మహిళా రోగి కాలికి కట్టు ఉన్న కారణంగా ఆమె కూర్చోలేకపోతోంది. అలాగే ఆ పురుషుని కాలికి సైతం ఫ్రాక్చర్ అవ్వడంతో.. మరో స్ట్రెచర్ అందుబాటులో లేదు.

దీంతో అక్కడే వున్న పోర్టబుల్ మంచంపై ఇద్దరిని వైద్య పరీక్షలకు తరలించారు. ఇరువురి కుటుంబ సభ్యులు సైతం మరో మార్గం లేక మిన్నకుండిపోయారు. అయితే అక్కడేవున్న రోగులు, వారి బంధువులు ఆస్పత్రి సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.