భారత వైమానిక దళంలోకి మహిళా అగ్నివీరులను వచ్చే ఏడాది నుంచి తీసుకోబోతున్నట్టు ఐఏఎఫ్ వెల్లడించింది. అంతేకాదు, ఐఏఎఫ్‌లో ప్రత్యేకంగా వెపన్ సిస్టమ్ బ్రాంచ్‌ను ఏర్పాటు చేయడానికి కేంద్రం నుంచి అనుమతులు వచ్చాయని వివరించింది.
న్యూఢిల్లీ: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి శనివారం సంచలన ప్రకటనలు చేశారు. వెపన్ సిస్టమ్ బ్రాంచ్ ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వివరించారు. స్వాతంత్ర్యం పొందిన తర్వాత ఐఏఎఫ్‌లో కొత్త బ్రాంచీ ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి అని తెలిపారు. ఎయిర్ ఫోర్స్ డే సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇది అన్ని రకాల నూతన వెపన్ సిస్టమ్‌లను హ్యాండిల్ చేస్తుందని, తద్వార రూ. 3,400 కోట్లను ఆదా చేసినట్టు అవుతుందని చెప్పారు.
అంతేకాదు, వచ్చే ఏడాది నుంచి మహిళా అగ్నివీరులను వైమానిక దళంలోకి చేర్చుకోబోతున్నట్టు ఆయన వెల్లడించారు. అగ్నిపథ్ స్కీం ద్వారా భారత వైమానిక దళంలో ఎయిర్ వారియర్లను నియమించుకోవడం సవాలు వంటిదని వివరించారు. అయితే, ఇది భారత శక్తిని పెంచే అవకాశం అని కూడా పేరర్కొన్నారు.
ప్రతి అగ్నివీరుడు ఐఏఎఫ్‌లో పని చేయడానికి కావాల్సిన జ్ఞానం, నైపుణ్యాలు నేర్పించడానికి తాము ట్రైనింగ్ మెథడాలజీని మార్చుకున్నట్టు ఆయన తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్2లో 3,000 మంది అగ్నివీరు వాయులకు ప్రాథమిక శిక్షణ అందిస్తామని చెప్పారు. ఈ సంఖ్య రానున్న సంవత్సరాల్లో పెరిగే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. అంతేకాదు, వచ్చే ఏడాది నుంచి మహిళా అగ్నివీరులనూ ఐఏఎఫ్‌లోకి తీసుకోవడానికి ప్రణాళికలు వేస్తున్నట్టు తెలిపారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు.
