స్కూల్ కు ఏనాడు వెళ్లలే.. కానీ 60 ఏండ్ల వయసులో ఏడాదికి కోటి సంపాదన.. నావల్ బెన్ సక్సెస్ స్టోరీ..!
సక్సెస్ కు చదువుతో పనిలేదు.. పట్టుదల ఉంటే చాలు అన్న మాటను ఎంతో మంది గొప్ప వ్యక్తులు నిరూపిస్తూ వస్తున్నారు. ఇలాంటి వారిలో నావల్ బెన్ అనే మహిళ కూడా ఉన్నారు. రిటైర్మెంట్ అయ్యే వయసులో ఏకంగా ఏడాదికి కోటి సంపాదిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
కోట్లు సంపాదించాలంటే కోటీశ్వరుల ఇంట్లో పుట్టాలి.. గొప్ప గొప్ప చదువులు చదవాలి. ఎన్నో డిగ్రీలు సంపాదించాలి అన్న మాటలను మనం చాలా మంది నోటినుంచి వింటుంటాం.. కానీ ఇలాంటివేవీ లేకుండా చిన్న మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఎంతో మంది నేడు కోట్లను సంపాదిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఏనాడు స్కూల్ కు వెళ్లని వారు కూడా పట్టుదలతో విజయం సాధిస్తున్నారు. వాళ్లను చూసి హేళన చేసిన వారు ముక్కున వేళేసుకునేలా చేస్తున్నారు. ముఖ్యంగా వ్యాపార రంగంలో తిరుగులేకుండా విజయం సాధిస్తున్నారు. వారి వృత్తిలో అభివృద్ధి చెందుతున్నారు. ఇలాంటి వారిలో వావల్ బెన్ దల్సంగ్ బాయ్ చౌదరి కూడా ఉన్నారు. ఈమె సాధించిన విజయం ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తోంది. మరి ఈమె సక్సెస్ జర్నీ ఎలా సాగిందో ఇప్పుడు తెలుసుకుందాం..
కనీసం స్కూలుకు కూడా వెళ్లని నావల్ బెన్ అనే మహిళ తన వ్యాపార పరిజ్ఞానం, చొరవతో ఏడాదికి లక్షలాది రూపాయలను సంపాదిస్తోంది. ఈమె వయసు 60 ఏండ్లు. రెస్ట్ తీసుకునే వయసులో నావల్ బెన్ మాత్రం ఎంతో లాభదాయకమైన సంస్థను నడుపుతోంది.
నావల్ బెన్ దల్సాంగ్ బాయ్ చౌదరి ఎవరు?
బనస్కాంత జిల్లాకు చెందిన నావల్ బెన్ అనే గుజరాతీ మహిళ రికార్డు సాధించింది. కరోనా సమయంలో అంటే మనం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న సమయంలోనే నావల్ బెన్ తన పాల వ్యాపారం ద్వారా నెలకు మిలియన్ల రూపాయలు సంపాదించింది. ఆమె 62 సంవత్సరాల వయస్సులో స్వంత పశుపోషణ, పాల ఉత్పత్తి వ్యాపారాన్ని స్టార్ట్ చేసింది.
గుజరాత్ లోని బనస్కాంత జిల్లా నాగ్లా గ్రామానికి చెందిన నవల్ బెన్ పాడి పరిశ్రమను మొదలు పెట్టడానికి ఎంతో కష్టపడింది. ఈ సంస్థను ప్రారంభించినప్పుడు ఈమె ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నది. అయినా ఏ మాత్రం భయపడలేదు. పట్టుదలతో ఎలాగైనా విజయం సాధించాలని నిశ్చయించుకుంది. ఇంకేముంది ఆమె పట్టుదల ఫలించింది. ఆమె సంస్థ క్రమంగా అభివృద్ధి చెందడం ప్రారంభించింది.
2020, 2021 సంవత్సరాల్లో నావల్ బెన్ కోటి రూపాయలకు పైగా పాలను విక్రయించినట్లు మీడియా వర్గాలు తెలిపాయి. దీని ద్వారా ఆమె నెలకు రూ.1.3 లక్షలకు పైగా సంపాదిస్తోంది. గత ఐదేళ్లుగా నావల్ బెన్ ఈ వ్యాపారాన్ని నిర్వహిస్తూ ఏటా కోటి రూపాయలకు పైగా విలువైన పాలను విక్రయిస్తున్నారు.
పలు నివేదికల ప్రకారం.. 2021లో నావల్‌బెన్ కు 45 ఆవులు, 80కి పైగా గేదెలు ఉన్నాయి. వీటి ద్వారా ఆమె సమీప గ్రామాలకు పాలను అందించేది. అంతేకాక నవల్ బెన్ 2020లో తన ఇంట్లో పాల వ్యాపారాన్ని ఏర్పాటు చేసింది. తన విజయాల ఫలితంగా నావల్ బెన్ తన జిల్లాలో మూడుసార్లు ఉత్తమ 'పశుపాలక్' అవార్డును గెలుచుకున్నారని మీడియా వర్గాలు తెలిపాయి. అంతేకాక ఆమె మూడు సార్లు "లక్ష్మి" అవార్డును కూడా అందుకున్నారు.