ఓ బస్సు ప్రమాదం వారిని కలిపింది. అనుకోకుండా.. ఒకరికి మరొకరు తెలియకుండా బస్సులో ప్రయాణం మొదలుపెట్టిన వారు.. ఆ తర్వాత జీవితాంతం కలిసి ప్రయాణం చేయాల్సి వస్తుందని ఊహించి ఉండరు. ఇంతకీ మ్యాటరేంటంటే.. బస్సు ప్రమాదంలో.. ఓ యువతి ఓ ఆర్మీ జవాను ప్రాణాలు కాపాడింది. ఈ క్రమంలో ఆమె తన చెయ్యి కూడా కోల్పోయింది. అయితే.. ఆ తర్వాత ఆ ఆర్మీ జవానే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈ సంఘటన కేరళలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

త్వరలో కేరళ స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో జ్యోతి అనే ఓ మహిళ బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగింది. ఈ సందర్భంగా ఆమె తన జీవితంలో జరిగిన ఓ విషయాన్ని తెలియజేయగా.. అది కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది.

ఛతీస్ గఢ్ కి చెందిన జ్యోతి పది సంవత్సరాల క్రితం బీఎస్సీ చదువుతోంది. ఆ సమయంలో.. ఆమె బస్సులో ప్రయాణిస్తుండగా.. ఆమె ఎదురుగా ఓ ఆర్మీ జవాను కూర్చొని ఉన్నారు. వారు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురవ్వగా.. ఆ సమయంలో.. ఆ ఆర్మీ జవానుని జ్యోతి తన ప్రాణాలకు తెగించి కాపాడింది.

వారు ప్రయాణిస్తున్న బస్సుని  అత్యంత వేగంతో ఎదురుగా ఓ ట్రక్కు వస్తున్న విషయాన్ని గమనించిన జ్యోతి ప్రమాదాన్ని పసిగట్టింది. అప్పటికే వికాస్ నిద్రలో ఉండటంతో అప్రమత్తమైన జ్యోతి.. వెనుక నుంచి వికాస్ తలను వెనక్కు లాగింది. అయితే, తన కుడిచేయి తీవ్రంగా దెబ్బతింది. ఎవరో తెలియని తనకోసం జ్యోతిచేసిన సాహసానికి వికాస్ ఫిదా అయ్యాడు.

తన ప్రాణాల కోసం సాహసం చేసి చేయి పొగొట్టుకున్న జ్యోతిని వికాస్ ఇష్టపడ్డాడు. అయితే, జ్యోతి తల్లిదండ్రులు మాత్రం కుమార్తె చేసిన పనికి ఆగ్రహించి, బలవంతంగా చదువు మాన్పించారు. దీంతో బీఎస్సీ (నర్సింగ్) మధ్యలో ఆగిపోయింది.

దీంతో వికాస్ వెంటన నడవాలని నిర్ణయించుకుని ఇంటి నుంచి వచ్చేసింది. ఇద్దరూ వివాహం చేసుకుని ఏడాది తర్వాత కేరళకు రాగా.. వికాస్ కుటుంబం ఆమెను కోడలిగా అంగీకరించారు. ప్రమాదం జరిగిన రోజును జ్యోతి మరోసారి గుర్తుచేసుకున్నారు. కాగా.. ప్రస్తుతం ఆమె కేరళ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.