Asianet News TeluguAsianet News Telugu

వీరప్పన్ ఆపరేషన్‌లో కీలకపాత్ర: ఎవరీ షణ్ముగప్రియ

గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్‌ను  ఆచూకీ కనిపెట్టడంలో కీలకంగా వ్యవహరించిన షణ్ముగప్రియ... తనకు దక్కాల్సిన  రివార్డు రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Woman who helped track Veerappan demands reward
Author
Tamil Nadu, First Published Oct 8, 2018, 3:17 PM IST


చెన్నై: గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్‌ను  ఆచూకీ కనిపెట్టడంలో కీలకంగా వ్యవహరించిన షణ్ముగప్రియ... తనకు దక్కాల్సిన  రివార్డు రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరప్పన్ ఆచూకీని కనిపెట్టడంలో తాను కీలక పాత్ర  పోషిస్తే తనకు  న్యాయం చేయలేదని ఆమె  అభిప్రాయపడుతున్నారు. ఈ విషయమై తనకు న్యాయం చేయాలని ఆమె ప్రధానమంత్రిని కోరినా ఫలితం లేకుండాపోయిందని చెబుతున్నారు.

గంధపు చెక్కల స్మగ్గర్ వీరప్పన్‌ను మట్టుబెట్టేందుకు  కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన  అధికారులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు.  అయితే వీరప్పన్ ఆచూకీని కనిపెట్టడంలో షణ్ముగప్రియ కీలకపాత్ర పోషించారు.  

తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులోని వాడపల్లి ప్రాంతానికి చెందిన షణ్ముగప్రియ వీరప్పన్‌కు చెందిన కీలక సమాచారాన్ని  పోలీసులకు అందించారు.
వీరప్పన్ సతీమణి ముత్తు లక్ష్మితో షణ్ముగప్రియ అత్యంత సన్నిహితంగా మెలిగేది.

 నాలుగు మాసాల పాటు  తన ఇంటిని ముత్తులక్ష్మికి  షణ్ముగప్రియ అద్దెకు ఇచ్చింది. వీరప్పన్‌కు సంబంధించిన కీలక సమాచారాన్ని  ముత్తులక్ష్మి ద్వారా సేకరించిన షణ్ముగప్రియ ఆ సమాచారాన్ని  వీరప్పన్ కేసులో కీలకంగా ఉన్న పోలీసులకు అందించేది.

నీలగిరి కొండల్లో భార్యను కలుసుకొనేందుకు వీరప్పన్  వస్తున్నాడనే సమాచారాన్ని షణ్ముగప్రియ పోలీసులకు అందించింది. అయితే  సమయంలో వీరప్పన్‌ పోలీసులకు చిక్కలేదు. 

అయితే  ఆ తర్వాత వీరప్పన్‌కు చూపు మందగించి తీవ్ర అనారోగ్యంతో  అడవులోనే ఉన్న విషయాన్ని తాను మరోసారి పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు  షణ్ముగప్రియ గుర్తు చేసుకొన్నారు. 

అయితే తన ప్రాణాన్ని ఫణంగా పెట్టి వీరప్ఫన్ సమాచారాన్ని పోలీసులకు ఇచ్చినా తనకు ప్రయోజనం లేకుండా పోయిందన్నారు.  ఇదిలా ఉంటే పోలీస్ శాఖ నుండి కానీ, ప్రభుత్వం నుండి కానీ తనకు గుర్తింపు రాలేదన్నారు. కనీసం  రివార్డుకు సంబంధించిన డబ్బులు కూడ చెల్లించలేదని ఆమె గుర్తు చేశారు.

ఈ విషయమై తనకు న్యాయం చేయాలని ప్రధానమంత్రి మోడీ కార్యాలయానికి కూడ లేఖ రాసినా కూడ ప్రయోజనం లేకుండా పోయిందని చెప్పారు. తనకు న్యాయం చేయాలని పీఎంఓ నుండి రాష్ట్ర ప్రభుత్వానికి  సమాచారం వచ్చిందన్నారు. కానీ ఫలితం దక్కలేదన్నారు. 

వీరప్పన్‌ను మట్టుబెట్టే ఆపరేషన్‌లో పాల్గొన్న  అధికారులకు మాత్రమే రివార్డు ఇవ్వాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. వీరప్పన్‌కు సంబంధించిన కీలక సమాచారాన్ని షణ్ముగ ప్రియ ఇచ్చినట్టు కొందరు పోలీసు ఉన్నతాధికారులు దృవీకరిస్తున్నారు. కానీ,  రివార్డు విషయాన్ని మాత్రం అంగీకరించడం లేదు.
 

Follow Us:
Download App:
  • android
  • ios