తిరువనంతపురం: శబరిమల గుడిలోకి అడుగు పెట్టిన 39 ఏళ్ల మహిళ కనకదుర్గ చిక్కులో పడింది. అత్తింటివారు ఆమెను ఇంట్లోంచి తరిమేశారు. ఆమె అత్తారింటికి మంగళవారంనాడు చేరుకుంది. అయితే కనకుదుర్గను భర్త, అత్తమామాలు బయటకు నెట్టేసి ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు.
 
ఈ సంఘటనపై ఆమె జిల్లా వయలెన్స్ ప్రొటక్షన్ అధికారికి కనకదుర్గ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ప్రస్తుతం కోర్టు ముందని, కోర్టు ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నామని కనకదుర్గ సన్నిహితులు మీడియాకు తెలిపారు. కనకదుర్గను పోలీసులు ఇంటికి తీసుకువెళ్లగా ఆమెను భర్త లోపలకు రానీయలేదు.  ఇంటికి తాళం వేసి, తన తల్లి, ఇద్దరు పిల్లలతో సహా ఇల్లు విడిచి వెళ్లిపోయారని వారు చెప్పారు. 

దాంతో కనకదుర్గ ప్రస్తుతం ప్రభుత్వ వసతి గృహంలో పోలీసుల రక్షణలో ఉంది. కనకదుర్గ ఇటీవల బిందు అమ్మిని అనే 40 ఏళ్ల మహిళతో కలిసి పోలీసు భద్రత మధ్య ఆలయ ప్రవేశం చేయడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో దాడులకు భయపడి ఇద్దరూ 13 రోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. 

ఈనెల 15వ తేదీ ఉదయం కనకుదుర్గ తన అత్తమామల ఇంటికి వచ్చింది. అయితే తన కోడలు ఆలయప్రవేశం చేయడం ఏమాత్రం జీర్ణించుకోలేని అత్త ఆమెను కొట్టింది. ఆ దెబ్బలకు కనకదుర్గ స్పృహ తప్పి పడిపోయింది. దాంతో కనకదుర్గను కోజికోడ్ మెడికల్ కాలేజీలో చేర్చారు. 

ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన అత్యున్నత న్యాయస్థానం కనకదుర్గ, బిందు అమ్మినికి పూర్తి భద్రత కల్పించాలని కేరళ పోలీసులను ఆదేశించింది.