ఓ యువతి పెళ్లి కాకుండానే తల్లి అయ్యింది. వెంటనే తాను ఉండే ఇంటిని మార్చేసింది. కొత్త ఇంటిలో మకాం మార్చింది. తాను గర్భవతి అన్న విషయాన్ని అందరి దగ్గరా దాచిపెట్టింది. తీరా... ప్రసవ సమయం దగ్గరపడటంతో.. తన అక్రమ సంబంధం బయటకు తెలిసిపోతుందేమో అని భయపడింది. అందుకే.. యూట్యూబ్ లో వీడియో చూసి.. తనకు తానే ప్రసవం చేసుకోవాలని ప్రయత్నించింది. అది వికటించి.. తల్లి, బిడ్డ ఇద్దరి ప్రాణాలు పోయాయి.  ఈ విషాదకర సంఘటన  ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... బహ్రయిచ్‌ ప్రాంతానికి చెందిన సదరు యువతి గత నాలుగేళ్లుగా గోరఖ్‌పూర్‌లో ఉంటూ పోటీ పరీక్షలకు సిద్దమవుతోంది. ఈ క్రమంలో వివాహేతర సంబంధంతో గర్భం దాల్చింది. ఈ విషయం ఎవరికి తెలియవద్దని గదిలో ఒంటరిగా వీడియో చూస్తూ ప్రసవానికి ప్రయత్నించింది. ఇది వికటించడంతో తీవ్ర రక్తస్రావానికి గురై ప్రాణాలు కోల్పోయింది.

ఇటీవలనే కొత్త రూంను ఆమె అద్దెకు తీసుకోగా.. ఆదివారం  ఆ రూం నుంచి రక్తం రావడం చుట్టూ పక్కల వాళ్లు చూసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. అక్కడికి చేరుకున్న పోలీసులు రక్తంమడుగులో ఉన్న పసికందును, యువతి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి శవపరీక్ష నిర్వహించారు. యువతి కుటుంబ సభ్యులెవరూ ఫిర్యాదు చేయకపోవడంతో కేసు నమోదు చేయలేదని పోలీసులు పేర్కొన్నారు.