ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. పోలీసులకు తమపై ఫిర్యాదు చేస్తుందనే కోపంతో ఓ మహిళకు ఇద్దరు వ్యక్తులు నిప్పంటించారు. లక్నోకు సమీపంలోని సీతాపూర్ గ్రామానికి చెందిన రాము, రాజేశ్‌లు సోదరులు.. వారు కొద్దికాలం నుంచి ఓ మహిళను వేధిస్తున్నారు.

ఓ రోజు ఆమెను అపహరించి అత్యాచారయత్నం చేయగా ఆమె తప్పించుకుంది. వెంటనే సదరు కామాంధులపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్లింది.. అయితే అక్కడి పోలీసులు ఆమెను పట్టించుకోలేదు..

దీంతో బాధితురాలి బంధువులు పోలీస్ కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్ చేయగా... వారు కూడా అదే పోలీస్ స్టేషన్‌‌కు వెళ్లమని సూచించగా మరోసారి ఆమెకు అదే నిరాశ ఎదురైంది. అయితే సదరు మహిళలు పదే పదే పోలీస్ స్టేషన్‌కు వెళ్లడంతో నిందితులు ఆమెపై ఆగ్రహంతో రగిలిపోయారు.

ఆదివారం నాడు బాధితురాలు బహిర్భూమికి వెళ్లిన సమయంలో ఆమెపై పెట్రోల్ పోసి, నిప్పంటించారు. ఈ ఘటనలో ఆమె శరీరం 60 శాతం మేర కాలిపోయింది. ఈ విషయం తెలుసుకున్న సీనియర్ పోలీస్ ఉన్నతాధికారి ఆస్పత్రికి చేరుకుని బాధితురాలిని పరామర్శించారు.

వెంటనే స్పందించిన ఆయన నిందితులను అదుపులోకి తీసుకుని వారిపై అత్యాచారం, హత్యాయత్నం సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బాధితురాలు ఫిర్యాదు చేసినా స్పందించకుండా విధుల్లో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేశారు.