పిల్లలకు విషం ఇచ్చి.. ఓ తల్లి తాను కూడా ఆత్మహత్యకు యత్నించింది. ఈ సంఘటన ఒడిశా రాష్ట్రంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు  చనిపోగా.. ఓ చిన్నారి ప్రాణాలతో పోరాడుతోంది. సదరు మహిళ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

కొండొలై గ్రామానికి చెందిన జానకి గగరెయి తన ముగ్గురు పిల్లలతో కలిసి అదే గ్రామంలోని తన ఇంట్లో నివశిస్తోంది. అయితే ఉన్నట్టుండి ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడడం స్థానికంగా సంచలనం రేకిత్తిస్తోంది. పిల్లలకు విషమిచ్చి ఆమె కూడా విషం తీసుకుంది. బిజూ(3), రాజు(4) చనిపోగా.. మరో చిన్నారి ప్రాణాలతో పోరాడుతోంది.


ఇంట్లో విషం తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన వీరిని తొలుత గ్రామస్తులు గుర్తించి, వైద్యసేవల నిమిత్తం స్థానిక క్యాపిటల్‌ ఆస్పత్రికి వీరిని తరలించారు. అప్పటికే ఇద్దరు చిన్నారులు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న చిన్నారిని కటక్‌ శిశు భవన్‌కి.. తల్లిని కటక్‌ ఎస్సీబీ మెడికల్‌ కళాశాల ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఇదే విషయంపై కేసు నమోదు చేసిన చందకా ఠాణా పోలీసులు జరిగిన ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు.