పెళ్లి చేసుకుంటానని చెప్పి 17 మంది యువకులకు వల వేసి... రూ.85 లక్షలు మోసానికి పాల్పడిందో కిలాడీ లేడీ. వివరాల్లోకి వెళితే... తమిళనాడులోని కడలూరు జిల్లా వలయామదేవి ప్రాంతానికి చెందిన బాలమురుగన్ అనే బంగారు నగల వ్యాపారి పెళ్లి చేసుకునేందుకు గాను కొన్నేళ్ల క్రితం మాట్రిమోనియల్‌లో పేరు నమోదు చేశాడు.

ఈ క్రమంలో సేలం జిల్లా ఆట్టయంపట్టి సమీపంలోని మరుమలయం పాలెంకు చెందిన 25 ఏళ్ల యువతి అతడిని సంప్రదించి 2016 సెప్టెంబర్ నుంచి పరిచయం పెంచుకుంది. ఫోన్, ఇతర మార్గాల ద్వారా అతనితో టచ్‌లో ఉంటూ పెళ్లి చేసుకుందామని నమ్మించింది.

తన కుటుంబ కష్టాలు, అవసరాలు చెప్పుకుంటూ డబ్బులు, ఇంటికి కావాల్సిన వస్తువులను అతని ద్వారా సమకూర్చుకుంది. అలా సుమారు రూ. 23 లక్షల వరకు వసూలు చేసుకుంది.

ఆ తర్వాత క్రమేణా అతనితో మాట్లాడటం తగ్గిస్తూ వచ్చింది. ఓ రోజు సదరు వ్యక్తి యువతి ఇంటికి వెళ్లినప్పుడు ఆమె సెల్‌ఫోన్‌ను తీసుకుని పరిశీలించగా చాలా మంది యువకులతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు అసభ్యంగా తీసుకున్న సెల్ఫీలు, ఛాటింగ్‌లు, ఎస్ఎంఎస్‌లు చూసి తాను మోసపోయినట్లుగా గుర్తించాడు.

ఇక చేసేది లేక తానిచ్చిన డబ్బు, నగదు, తిరిగి పొందేందుకు గాను సేలంకు చెందిన రాజా అనే వ్యక్తి ద్వారా సంప్రదించాడు. అయితే అతను కూడా యువతితో చేతులు కలిపి బాలమురుగన్‌తో బలవంతంగా ఆమె మెడలో తాళి కట్టించి ఫోటోలు తీసుకుని అతనిని వెళ్లగొట్టారు.

తరువాత ఆ ఫోటోలను చూపుతూ మరికొన్ని లక్షలు ఇవ్వాల్సిందిగా బెదిరింపులకు దిగారు. దీంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్పీ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించడంతో కిలాడీ లేడీ పారిపోయింది.

మరోవైపు పోలీసుల విచారణలో ఒక్క బాలమురుగనే కాకుండా కోయంబత్తూరు, మధురై, చెన్నై, తిరుచ్చిరాపల్లి ప్రాంతాలకు చెందిన 17 మంది యువకులనపు మోసగించి రూ. 85 లక్షల వరకు వసూలు చేసినట్లుగా తేలింది.