దేశ ఐటీ నగరి బెంగళూరులో దారుణం జరిగింది. తీసుకున్న అప్పు తీర్చలేదని ఓ మహిళను చెట్టుకు కట్టేసి అవమానించారు కొందరు. వివరాల్లోకి వెళితే.. చామరాజనగర్ జిల్లాకు చెందిన రాజమణి కొంతకాలంగా కొడిగిహళ్లిలో ఉంటూ చిన్న హోటల్ నడుపుకుంటోంది.

రాజమణి స్త్రీశక్తి పొదుపు సంఘం నుంచి  రూ. 11 లక్షల రుణం తీసుకుని గ్రామాన్ని వదిలి పారిపోయిందని స్థానికులు భావించారు. ఈ క్రమంలో నెల రోజుల తర్వాత గ్రామానికి తిరిగి వచ్చిన రాజమణిని గ్రామస్థులు పట్టుకున్నారు.

అనంతరం ఊరి నడిబొడ్డున ఉన్న  విద్యుత్ స్తంభానికి కట్టేశారు. డబ్బు తిరిగి చెల్లించాలంటూ ఊగిపోయిన గ్రామస్తులు ఆమెపై దాడికి పాల్పడ్డారు. జనం సినిమా చూస్తున్నట్లు చూసారే గాని ఏ ఒక్కరు కూడా వారిని ఆపేందుకు ప్రయత్నించలేదు.

అయితే కొందరు స్థానికులు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. అది వైరల్ కావడంతో విషయం పోలీసుల దాకా వెళ్లింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు రాజమణిని విడిపించి.. కేసుతో సంబంధమున్న ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.