కట్టుకున్న భర్తను కసితీరా దాదాపు 12సార్లు పొడిచి చంపేసింది. అనంతరం ఆమె కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

హర్యానా రాష్ట్రంలోని యమునానగర్ నివాసి చిరాగ్ వర్మ(37), మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినికి చెందిన రేణుక (36) ఒకే బీమా సంస్థలో పనిచేసే వారు. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకొని ఢిల్లీలోని ఛత్తర్పూర్ ప్రాంతంలోని ఇంట్లో నివాసముండేవారు. ఈ దంపతులకు పిల్లలు లేకపోవడంతో తరచూ వీరూ గొడవ పడుతుండే వారు. భార్యతో గొడవపడిన భర్త శర్మ తన గదిలో నిద్రపోయాడు. కోపంతో భార్య రేణుక వంటగదిలోని కత్తితో అతన్ని 12 సార్లు పొడిచింది. అనంతరం రేణుకా కూడా ఆత్మహత్యా యత్నం చేసింది. 

దానికి ముందు తన సూసైడ్ నోట్ ను ఫేస్ బుక్ లో పోస్టు చేసింది. దీంతో ఆమె స్నేహితులు వారి బంధువులు, వారు నివాసముంటున్న ఇంటి యజమానిని అప్రమత్తం చేశారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి ఇంటి తలుపు పగులగొట్టి చూడగా భార్యాభర్తలిద్దరూ అపస్మారక స్థితిలో ఉన్నారు. గోడలపై రక్తం కనిపించింది. అంబులెన్సులో దంపతులను ఆసుపత్రికి తరలించగా భర్త శర్మ మరణించాడని వైద్యులు చెప్పారు. రేణుక పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.