ముంబై: చదువుల పేరుతో తమ పిల్లలపై ఒత్తిడి పెంచే తల్లిదండ్రులను ఇంచుమించు ప్రతి ఇంట్లోనూ చూస్తుంటాం. కానీ ఆ పేరిట కన్న కూతురిని పెన్సిల్ తో పొడవడమే కాకుండా కొరికి తీవ్రంగా గాయపర్చిందో కసాయి తల్లి. ఈ దారుణం మహారాష్ట్ర రాజధాని ముంబైలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... కరోనా వ్యాప్తి కారణంగా దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా స్కూళ్లు మూతపడిన విషయం తెలిసిందే. అయితే పిల్లల చదువులు అటకెక్కకుండా ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి కొన్ని స్కూల్స్. అలా ముంబైలోని ఓ స్కూల్ కూడా ఇలాగే విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తోంది. 

అయితే ఇలా క్లాస్ కు హాజరైన ఓ పన్నెండేళ్ల బాలికను టీచర్ కొన్ని ప్రశ్నలడిగింది. అందుకు బాలిక సమాధానం చెప్పలేకపోవడాన్ని గమనించిన తల్లి అతి దారుణంగా వ్యవహరించింది. చిన్నారిని పెన్సిల్ తో పొడిచి గాయపర్చడమే కాకుండా చేతిని కొరుకుతూ అత్యంత పాశవికంగా వ్యవహరించింది. ఇలా చెల్లిని తల్లి హింసించడం చూడలేక పెద్దకూతురు పోలీసులకు సమాచారం అందించింది. 

దీంతో పోలీసులు ఆ ఇంటికి చేరుకుని విచారణ చేపట్టారు. బాలిక పట్ల కర్కషంగా వ్యవహరించిన తల్లిపై కేసు నమోదు చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు. అలాగే బాలికను వైద్యం కోసం హాస్పిటల్ కు తరలించారు.