భర్త తనపై ప్రేమ చూపించడం లేదనో, లేదంటే తాగొచ్చి చిత్రహింసలు పెడుతున్నాడని విడాకులు తీసుకునే వారిని చూసుంటాం. కానీ భర్త చూపించే ప్రేమ తట్టుకోలేక ఓ మహిళ విడాకులకు దరఖాస్తు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌‌కు చెందిన ఓ మహిళలకు 18 నెలల క్రితం వివాహమైంది. ఆమె భర్త ఆ మహిళను ప్రేమగా, ఎంతో అపురూపంగా చూసుకుంటున్నాడు. ఆమెను సంతోష పెట్టేందుకు నిత్యం ప్రయత్నిస్తుంటాడు.

అయితే వారిద్దరి మధ్య ఈ ప్రేమే మనస్పర్థలకు కారణమైంది. తనపై చూపిస్తున్న అతి ప్రేమను తట్టుకోలేకపోతున్నానని ఆమె ఏకంగా విడాకులు కావాలని స్థానిక షరియా కోర్టును ఆశ్రయించింది.

తన భర్త ఇంటి పనుల్లో సాయం చేస్తాడని, వంట చేసి పెడతాడని, తప్పు చేస్తే వెంటనే క్షమిస్తాడని ఆమె పేర్కొంది. తనపై ఎప్పుడూ కోప్పడడని తెలిపింది. కానీ తనకు అతనితో గొడవ పడాలని ఉంటుందని... ఇంత ప్రేమను తాను భరించలేనని ఆ వివాహిత తన పిటిషన్‌లో పేర్కొంది.

ఇలాంటి వాతావరణంలో తాను ఇమడలేకపోతున్నానని తెలిపింది. అయితే ఆమె చెప్పిన కారణం విన్న న్యాయస్థానం ఆ వివాహిత పిటిషన్‌ను తిరస్కరించింది. భార్యా భర్తలే తమ సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది.

దీంతో ఆమె స్థానిక పంచాయితీ పెద్దలను ఆశ్రయించింది. కోర్టులో ఎదురైన అనుభవమే ఆమెకు మళ్లీ ఇక్కడా ఎదురైంది. ఇలాంటి భర్తతో ఎందుకు విడిపోతావని చెప్పి పెద్దలు ఇంటికి పంపించివేశారు.