Asianet News TeluguAsianet News Telugu

బెంగళూరు వర్షాలు : మహిళ చీర ఐదుగురి ప్రాణాలు కాపాడింది..

బెంగళూరులో మూడు రోజుల క్రితం జరిగిన వరద ప్రమాదంలో ఓ మహిళ చీర ఐదుగురి ప్రాణాలు కాపాడింది. చీరను తాడులా చేసి కట్టడంతో దాన్ని పట్టుకుని ఐదుగురు బైటికి వచ్చారు. 

woman saree saves five people in flooded underpass in bangalore - bsb
Author
First Published May 23, 2023, 9:13 AM IST

బెంగళూరు : కళ్ళ ముందు ప్రమాదం జరుగుతున్నప్పుడు వెంటనే స్పందించడం వల్ల ఎంతమంది ప్రాణాలను కాపాడవచ్చో నిరూపించింది ఓ మహిళ. ఇటీవల కాలంలో ఇలాంటి తక్షణ స్పందన కరువవుతోంది. ప్రమాదాన్ని వీడియోలో చిత్రీకరిస్తూ నిలబడి పోతున్నారే తప్ప రంగంలోకి దిగి సహాయ పడదామన్న ఆలోచన చేయడం లేదు. కాస్తో, కూసో సహాయం చేయాలనుకునేవారు అంబులెన్స్ కు, పోలీసులకు ఫోన్లు చేసి సమాచారం అందిస్తున్నారు. 

అయితే, కొన్నిసార్లు వారువచ్చి కాపాడే వరకు.. ప్రాణాలు ఆగే పరిస్థితి ఉండదు.. ఆ సమయంలో చూపే తెగువ వారి ప్రాణాలు కాపాడుతుంది. ఇదంతా ఎందుకంటే..  బెంగళూరులో కురుస్తున్న భారీ వర్షాలకు ఆదివారం.. ఆంధ్రప్రదేశ్ కు చెందిన భానురేఖ అనే యువతి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మరో ఐదుగురి ప్రాణాలను ఓ మహిళ చీర కాపాడింది.  

బెంగళూరు భారీ వర్షం.. అండర్​ పాస్ లో చిక్కుకున్న కారు.. ఏపీ మహిళ సాఫ్ట్‌వేర్‌ మృతి..

దీనికి సంబంధించి వివరాలలోకి వెళితే.. బెంగళూరులో కురుస్తున్న భారీవర్షాలకు ఆదివారం నాడు కేఆర్ కూడలి సమీప అండర్పాస్ లో  పొంగిన నీటిలో ఓ క్యాబ్ చిక్కుకుంది. ఆ సమయంలో క్యాబ్లో మొత్తం ఆరుగురు ఉన్నారు. అందులో భానురేఖ అనే టెకీ.. నీటిలో మునిగి మృతి చెందగా..  మిగిలిన ఐదుగురిని బీబీఎంపీ రక్షణ బృందం కాపాడింది.

అయితే,  ఆ బృందాలు సంఘటన స్థలానికి వచ్చేంతవరకు వారి ప్రాణాలను ఓ మహిళ చీర కాపాడింది. ఆ సమయంలో అటుగా వెళుతున్న ఆ మహిళ  (42).. కెఆర్ కూడలిలోని అండర్పాస్ లో ఏదో గొడవ జరుగుతుందని గమనించింది. అప్పటికే అక్కడికి చేరుకున్న మీడియా ప్రతినిధి ఒకరు నీటిలో ఈత కొడుతూ మునిగిన కారులో చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నంలో ఉన్నారు. ఆ నీటిలో నుంచి బయటికి రావడానికి వారికి తాడు లాంటిది అవసరమైంది.

అక్కడికి చేరుకున్న మహిళను గమనించిన అతను తాడు లాంటిది ఏదైనా ఉంటే ఇవ్వాలని కోరాడు. అప్పటికే అక్కడ చాలామంది ఉన్నా కూడా.. అందరూ చూస్తున్నారే కాని.. ఎవరూ అతను అడుగుతున్నది పట్టించుకోలేదు. సహాయానికి ముందుకు రాలేదు. ఆ మహిళ వెంటనే పరిస్థితిని అర్థం చేసుకొని తాను కట్టుకున్న చీరను విప్పి ఆ యువకుడికి అందించింది. అంతేకాదు ఆ చీర మరోకొసను అండర్ పాస్ కు ఉన్న ఇనుప ఊచలకు కట్టింది. దీంతో ఆ చీరను పట్టుకుని ఒక్కొక్కరు బయటికి వచ్చారు. ఆ మహిళ  చేసిన పనికి అక్కడి వారంతా ఒక్కసారిగా.. షాక్ అయ్యారు.  

వెంటనే అభినందనలు కురిపించారు. తాము కూడా ముందుకు వచ్చారు. మరో మహిళ తన దగ్గర ఉన్న దుపట్టాను అందించింది,  ఇంకొక వ్యక్తి తన చొక్కాను విప్పి ఆ మహిళలకు ఇచ్చాడు.  వాటన్నింటితో తాడు లాగా చేయడం వల్ల వాటిని పట్టుకొని వారంతా నీటిలో నుండి బయటకు రాగలిగారు. ఆ మహిళ చూపిన తెగువకు  అక్కడి వారందరూ అభినందనల వర్షం కురిపించారు. ఆ మహిళ సమయస్ఫూర్తి, ప్రాణాపాయ సమయంలో  ఏది ముఖ్యమో చురుకుగా గమనించిన ఆమె తెలివిని అందరూ కొనియాడారు. 

Follow Us:
Download App:
  • android
  • ios