అప్పుడే పుట్టిన పసికందుని ఒడిలో పెట్టుకొని..ఓ వివాహిత భర్త ఇంటి ముందు కూర్చొని ధర్నా చేపట్టింది. ఆ పుట్టిన బిడ్డతో తనకు సంబంధం లేదంటూ... భర్త ఆరోపించగా... ఏం చేయాలో తెలియక... ఆమె ఆ బిడ్డతో కలిసి ఆందోళనకు దిగింది. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...తెన్‌కాశి జిల్లా కడైయమ్‌ సమీపం కట్టెలి పట్టి కీళ వీధికి చెందిన పరమశివన్‌ కుమారుడు మురుగన్‌ (30). ఇంజినీర్‌ అయిన ఇతను ఇండోనేషియాలో పనిచేస్తూ వస్తున్నాడు. ఇతనికి అదే ప్రాంతానికి చెందిన గురుస్వామి కుమార్తె, ఇంజినీర్‌ అయిన తేన్‌మొలి (27)తో గత ఫిబ్రవరిలో వివాహమైంది. 

తరువాత మురుగన్‌ పనికోసం ఇండోనేషియాకి బయలుదేరి వెళ్లాడు. ప్రస్తుతం అతను అక్కడ పనిచేస్తున్నాడు. తేన్‌మొలి కోవైలో ఉన్న ప్రైవేట్‌ సంస్థలో పనిచేస్తోంది. గర్భంతో ఉండడంతో ఆమె పనిని వదిలి ఊరుకి తిరిగి వచ్చింది. తరువాత కన్నవారి ఇంట్లో నివసిస్తూ వచ్చింది.

కాగా... ఇటీవల ఆమెకు ఆడపిల్ల పుట్టింది. ఇదే విషయాన్ని భర్తకు ఆనందంగా ఫోన్ చేసి చెప్పింది. బిడ్డనుచూడటానికి రమ్మని కోరింది. అయితే... తాను బిజీగా ఉన్నానని రాలేనని చెప్పాడు. దీంతో.... ఆమె చాలా బాధపడింది. కాగా... ఇటీవల భర్త ఇంటికి బిడ్డను తీసుకొని వెళ్లింది. అయితే... అత్తమామలు ఆమెను ఇంట్లోకి రానివ్వలేదు. ఆ బిడ్డ తమ కొడుకుకి పుట్టిన వారు కాదని ఆరోపించారు. భర్తకు ఫోన్ చేస్తే... అతను కూడా అదే విషయం చెప్పాడు.

దీంతో.... ఆమె బిడ్డతో సహా.. ఆందోళన చేపట్టింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఈ బిడ్డ తనకు పుట్టలేదని భర్త చెబుతున్నాడని, నేను డీఎన్‌ఏ పరిశోధనకి సిద్ధంగా ఉన్నానని చెప్పింది. ఆమెని కడైయమ్‌ పోలీసు స్టేషన్‌కి తీసుకుని వెళ్లి పోలీసులు విచారణ చేశారు.  నీ భర్త నెలలో ఊరికి వస్తాడు.. అతనితో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు నచ్చజెప్పి పంపారు.