ఓ మహిళ.. తన కన్న తల్లితో పాటు.. తన కడుపున పుట్టిన ఇద్దరు బిడ్డలకు, ఇంట్లో పెంచుకునే కుక్కలకు కూడా విషమిచ్చి చంపేసింది. అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...తిరువారూర్ జిల్లా మన్నార్ కుడికి చెందిన రాజ్ గోపాల్ కి భార్య, కుమార్తె, మనవరాళ్లు ఉన్నారు. కాగా.. పది నెలల క్రితం రాజ్ గోపాల్ అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయాడు. కాగా.. అప్పటి నుంచి ఆయన భార్య శాంతి(50), కుమార్తె తులసి(21), మనవరాళ్లు సారల్(2), మరో చిన్నారి(10) కలిసి జీవిస్తున్నారు. 

జీవనోపాధికోసం వీరు ఈ ఏడాది జనవరిలో తంజారు జిల్లా పట్టుకోట్టైకి వలస వచ్చారు. అక్కడే ఓ ఇంట్లో ఇల్లు అద్దెకు తీసుకోని జీవిస్తున్నారు. కాగా.. తులసి భర్త వివరాలు మాత్రం ఎవరికీ తెలియకపోవడం గమనార్హం. కాగా.. ఆదివారం వారంతా పురుగుల మందు కలిపిన ఆహారం తీసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు.

వాళ్ల ఇంట్లో నుంచి ఎలాంటి అలికిడి వినపడకపోవడంతో... అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చిచూసే సరికి.. అంతా విగతజీవులై కనిపించారు. శాంతి ఉరి వేసుకుని మృతిచెందింది. పక్కనే బెడ్‌ మీద ఇద్దరు పిల్లలు, తులసీ, ఆ పక్కనే రెండు పెంపుడు శునకాలు మరణించి ఉన్నాయి. అంద రూ కొత్త బట్టలు ధరించి ఉన్నారు. ఆ కుటుంబానికి సంబంధించిన వివరాలు ఎవరికీ తెలియకపోవడంతో విచారణ కష్టతరంగా మారింది. ఇళ్లు అద్దెకు తీసుకున్న సమయంలో ఇచ్చిన సమాచారం ఆధారంగా వారి పేర్లను నిర్ధారించారు. ఆ ఇంట్లో మగవాళ్లు లేకపోవడంతో ఆర్థిక కష్టాలతో ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.