ఐదు నెలల చిన్నారికి పాలలో విషం కలిపిచ్చి చంపింది ఓ మహిళ. తన సవతికి పుట్టిన బిడ్డకు ఆస్తిపోతుందని ఈ దారుణానికి ఒడిగట్టింది. 

కర్ణాటక : నలుగురు బిడ్డలను కన్నతల్లి.. మరో తల్లి కన్నబిడ్డని.. ఐదు నెలల పసి గుడ్డు అని కూడా చూడకుండా విషం పాలు తాగించి చంపింది. ఈ దారుణమైన ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది. తన భర్త మొదటి భార్యకు పుట్టిన చిన్నారిపై… రెండో భార్య కర్కషంగా ప్రవర్తించింది. శుక్రవారంనాడు దేవమ్మ అనే గృహిణిని ఈ హత్యరోపణలపై కర్ణాటకలోని యాదగిరి గ్రామీణ ఠాణా పోలీసులు అరెస్టు చేశారు. 

దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే.. యాదగిరి సమీప బబలా గ్రామానికి చెందిన సిద్ధప్ప బెట్టిగేరికి ఇద్దరు భార్యలు. అతనికి మొదటి భార్యతో సంతానం కలగలేదు. దీంతో మొదటి భార్య అయిన శ్రీదేవి ఏడేళ్ల కిందట దేవమ్మ అనే మహిళతో సిద్ధప్పకు రెండో వివాహం జరిపించింది. ఆ తరువాత దేవమ్మకు నలుగురు పిల్లలు కలిగారు.

వివాహేతర సంబంధం : అనుమానంతో భార్యను కత్తితో పొడిచి చంపి.. పోలీసులకు ఫోన్ చేసిన భర్త...

ఈ క్రమంలో ఐదు నెలల కిందట శ్రీదేవి కూడా తళ్లయింది. ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఎన్నో సంవత్సరాల తర్వాత పుట్టిన పాపను అల్లారుముద్దుగా చూసుకుంటూ పాపకు సంగీత బెట్టిగేరి అని పేరు కూడా పెట్టారు. శ్రీదేవికి పాప పుట్టినప్పటినుంచి దేవమ్మ లోపలోపల ఉడికిపోతోంది. ఇదే సమయంలో ఆగస్టు 30వ తేదీన శ్రీదేవికి పుట్టిన చిన్నారి సంగీత ఏడుస్తుంది.

దీంతో పాపకు పాలు పట్టించాలని శ్రీదేవి, దేవమ్మకు తెలిపింది. తాను ఇంటి పనుల్లో మునిగిపోయింది. తన బిడ్డలకు కాకుండా ఆ చిన్నారికి ఆస్తిలో వాటా వెడుతుందన్న అక్కస్సుతో దేవమ్మ దారుణానికి తెరతీసింది. పాలల్లో విషం కలిపించి.. అభం శుభం తెలియని ఆ చిన్నారికి తాగించింది. ఆ విషం పాలు తాగిన తర్వాత మూడు గంటల్లోనే ఆ చిన్నారి మృతి చెందింది.

సాధారణంగానే చనిపోయిందని భావించినా.. ఆసుపత్రికి తీసుకువెళ్లడంతో వైద్య పరీక్షలు చేయగా విష ప్రయోగంతోనే బిడ్డ చనిపోయిందని అక్కడి డాక్టర్లు నిర్ధారించారు. దీంతో అనుమానం వచ్చిన శ్రీదేవి.. దేవమ్మ మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. శ్రీదేవి ఫిర్యాదు మేరకు దేవమ్మను అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నించగా…నేరాన్ని అంగీకరించింది. దీంతో ఆమెను అరెస్టు చేసినట్లుగా పోలీసులు ధృవీకరించారు.