కుటుంబ సమస్యలను తట్టుకోలేక ఆమె భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆమె ఒంటరైపోయింది. కనీసం బంధువులు కూడా ఆమెకు అండగా నిలవలేదు. దీంతో.. ఆమెకు ఓ దివ్యాంగుడు అండగా నిలిచాడు. ఆమెకు తోడుగా ఉంటున్నాడు. కాగా.. వారి స్నేహ బంధాన్ని తప్పుగా అర్థం చేసుకున్న బంధువులు వారి పట్ల నీచంగా ప్రవర్తించారు. వారిద్దరికీ గుండు గూయించి మెడలో చెప్పుల దండ వేసి మరీ అవమానించారు. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకోగా... పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్ లోని కనౌజ్ జిల్లాకు చెందిన మహిళ(37)భర్త రెండు నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి దివ్యాంగుడైన ఓ నలభై ఏళ్ల వ్యక్తి సదరు మహిళకు సహాయంగా ఉంటూ స్నేహం కొనసాగిస్తున్నాడు. అయితే వీరి మధ్య ఉన్న బంధం బాధితురాలి బంధువులకు ఎంతమాత్రం నచ్చలేదు. భర్త చనిపోయిన తర్వాత పరాయి మగవాడితో చనువుగా ఉంటూ తమ పరువు తీస్తోందని భావించారు. దీంతో వాళ్లిద్దరికీ ఎలాగైనా బుద్ధిచెప్పాలనుకున్నారు. 

ఈ క్రమంలో బుధవారం వాళ్లిద్దరు మాట్లాడుకుంటున్న సమయంలో నెమ్మదిగా అక్కడికి చేరుకున్నారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ.. బాధితులకు గుండు కొట్టించారు. అనంతరం ముఖానికి నల్లరంగు పూసి, చెప్పుల దండ మెడలో వేసి వీధుల గుండా ఊరేగించారు. 

ఈ తతంగాన్నంతా కొంతమంది సెల్‌ఫోన్‌లో వీడియో తీయడంతో ఈ అమానుష చర్య వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. మొత్తం ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు.