ముంబై: ఓ మహిళ అత్తను చంపేసి ఆ తర్వాత పక్కించి బాత్రూంలోకి వెళ్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. క్షణికావేశంలో అత్తను చంపిన కోడలు ఆ తర్వాత భయంతో ఆ పనిచేసింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని రాయ్ గడ్ జిల్లాలో జరిగింది. విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

పోలీసులు ఆ ఘటన వివరాలను వెల్లడించారు. రాయగడ్ జిల్లాకు చెందిన యోగిత (32) అనే మహిళ భర్త రెండేళ్ల క్రితం మరించాడు. ఆమె తన ఇద్దరు పిల్లలతో అత్తగారింట్లో ఉంటోంది. తరుచుగా అత్తతో గొడవలు జరిగేవి. శుక్రవారంనాడు కూడా గొడవ జరిగింది. 

ఆ క్రమంలో తీవ్రమైన ఆగ్రహానికి గురైన యోగిత ఇనుప రాడుతో అత్త తారాబాయ్ ని కొట్టి చంపింది. మామ, ఇద్దరు పిల్లల ముందే ఆ దారుణానికి పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు తనను పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో యెగిత పక్కింటి బాత్రూంలోకి వెళ్లి తలుపు వేసుకుంది. 

ఆ తర్వాత టాయిలెట్ క్లీనర్ తాగి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. పోలీసులు బాత్రూం తలుపులు బద్దలు కొట్టి చూశారు. యోగిత అపస్మారక స్థితిలో వారికి కనిపించింది. ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కాగానే నిందితురాలిని అరెస్టు చేస్తామని పోలీసులు చెప్పారు.