మహారాష్ట్రలో ఇటీవలి కాలంలో చిన్నారులను సొంత తల్లే చంపుతున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. మే 31న ఆరుగురిని చంపిన తల్లి ఘటన మరువకముందే.. ఏడుస్తున్నారని ఇద్దరు పిల్లల్ని గొంతునులిమి చంపిందో కర్కశురాలు.
ముంబై : Maharashtraలోని నాందేడ్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కన్నతల్లి కర్కశానికి ఇద్దరు చిన్నారులు బలయ్యారు. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బాధ్యతను విస్మరించి.. ఏడుస్తున్నారు అన్న కారణంతో రెండు రోజుల వ్యవధిలో నాలుగు నెలల పసిపాపతో పాటు.. రెండేళ్ల కుమారుడినీ గొంతునులిమి చంపేసింది. ఆ తర్వాత వారి dead bodyలను పొలంలో కాల్చేసింది ఓ తల్లి. స్థానిక పోలీసులు శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించారు. భోకర్ లోని పాండుఠ్నా గ్రామానికి చెందిన దుర్పదాబాయి నిమల్ వాడ్ కు రెండేళ్ల కుమారుడు దత్తాతో పాటు నాలుగు నెలల చిన్నారి అనసూయ ఉంది.
పిల్లలిద్దరూ ఆపకుండా ఏడుస్తూ ఉండడంతో ఆగ్రహించిన ఆమె..మే 31న అనసూయ గొంతు నులిమి చంపేసింది. మరుసటి రోజు జూన్ 1న ఆహారం కోసం ఏడ్చిన కుమారుడినీ అే రీతిలో చంపేసిందని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ముఖేడ్ ప్రాంతంలో నివాసం ఉంటున్న తల్లి కొండాబాయి రాజేమోద్, సోదరుడు మాధవ్ రాజేమోద్ లను పిలిపించుకుని వారి సాయంతో మృతదేహాలను పొలంలో కాల్చేసినట్లు వెల్లడించారు. ఈ ఘటనలో నిందితురాలితో పాటు ఆమెకు సహకరించిన తల్లి, సోదరుడిని కూడా అరెస్ట్ చేసినట్లు పోలీసు స్టేషన్ అధికారులు తెలిపారు.
కాగా, మే 31న మహారాష్ట్రలోని రాయగడ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ తల్లి తన సంతానాన్ని తానే చంపుకుంది. కుటుంబ కలహాల కారణంగా తన ఆరుగురు పిల్లల్ని బావిలో పడేసి చంపేసింది. చనిపోయిన ఆరుగురు చిన్నారుల్లో ఐదుగురు బాలికలే ఉన్నారు. ఈ ఘటన ముంబైకి 100 కిలోమీటర్ల దూరంలోని మహద్ తాలూకా లోని ఖరవలి గ్రామంలో చోటు చేసుకుంది. ఈ మేరకు పోలీసులు 30 ఏళ్ల మహిళ తన భర్త, కుటుంబ సభ్యులు తనను దారుణంగా కొట్టడంతో ఈ ఘోరానికి ఒడిగట్టిందని తెలిపారు. చనిపోయిన చిన్నారులంతా 18 నెలల నుంచి 30 ఏళ్ల మధ్య వయసు వారేనని అధికారులు తెలిపారు.
ఇలాంటి ఘటనే ఏప్రిల్ 26న తెలంగాణ రాష్ట్రం మంచిర్యాలలో చోటు చేసుకుంది. మంచిర్యాలలో దారుణం జరిగింది. అమానవీయ ఘటన చోటు చేసుకుంది. కన్నతండ్రే అనుమానంతో ఓ చిన్నారి ఉసురు తీశాడు. భార్య మీద అనుమానంతో కడుపున పుట్టిన కొడుకునే 11నెలల చిన్నారిని పాశవికంగా నేలకేసి కొట్టాడు. పట్టరాని కోపంలో చేసిన ఆ పనితో ఆ పసివాడికి నూరేళ్లు నిండాయి.
కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకున్న భర్త విచక్షణ కోల్పోయి భార్య చేతిలో ఉన్న పసికందును నేలకేసి కొట్టి ప్రాణాలు పోయేలా చేశాడు. ఈ దారుణ ఘటన మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పులిమడుగు గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం మందమర్రి మండలం pulimaduguకు చెందిన నరేష్, జ్యోతి దంపతులకు రెండేళ్ల క్రితం పెళ్లయింది. వీరికి 11నెలల బాబు ఉన్నాడు. నరేష్ ఇసుక బట్టిలో పనిచేస్తాడు. అయితే, ఈ క్రమంలో తన భార్య జ్యోతిపై అనుమానపడుతుండేవాడు. దీంతో ఇంట్లో ఆమెతో తరచూ గొడవపడుతూ ఉండేవాడు.
అదే సమయంలో ఆదివారం అర్ధరాత్రి తాగి వచ్చిన నరేష్ భార్యతో మల్లోసారి ఘర్షణ పడ్డాడు. ఇష్టానుసారం కొడుతూ భార్య చేతిలో ఉన్న పసికందును నేలకేసి బాదాడు. అనుకోని ఈ పరిణామానికి భార్య తేరుకునేలోపే.. చిన్నారి తీవ్ర గాయాలపాలయ్యాడు. ఇది గమనించిన స్థానికులు చిన్నారిని ఆస్పత్రికి తరలిస్తుండగా మధ్యలోనే కన్నుమూసాడు. దీనిమీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. ప్రస్తుతం నిందితుడు నరేష్ పోలీసులు అదుపులో ఉన్నట్లు సమాచారం. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు.
