వివాహేతర సంబంధాలు కాపురాలను కూలుస్తున్నాయి. ఇలాంటి సంఘటనలు రోజూ వార్తల్లో వస్తూనే ఉన్నాయి. అయినా కూడా చాలా మంది అలాంటి సంబంధాల కోసమే పరితపిస్తున్నారు. తాజాగా.. ఓ మహిళ ప్రియుడి మోజులో కట్టుకున్న భర్తను దారుణంగా హత్య చేసింది. ఆ తర్వాత దానిని ఆత్మహత్యగా చిత్రీకరించింది. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పూందమల్లి సమీపంలోని కాట్టుపాక్కం ఓం శక్తి నగర్‌ కు చెందిన ధరణీ ధరణ్‌ (39), కారు డ్రైవర్‌. ఇతని భార్య భవాని (31). వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గత 22వ తేదీ అప్పుల బాధతో భర్త ఆత్మహత్య చేసుకున్నట్లు భవాని పూంద మమల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ ప్రకారం పూందమల్లి పోలీసులు ధరణీధరణ్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం  ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

పోస్టుమార్టం రిపోర్టులో ధరణీ ధరణ్‌ గొంతు నులిమి హత్య చేయబడినట్లు తేలడంతో భవానిని పోలీసులు విచారణ చేశారు. ఆమె పొంతనలేని సమాధానాలు చెప్పడంతో ఆమె సెల్‌ఫోన్‌ నంబర్ల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఆమె తరచూ ఫోన్‌లో మాట్లాడుతున్న ఓ వ్యక్తి మృతుడి ఇంటికి వచ్చినట్లు తెలిసింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు భవానిని ప్రశ్నించగా ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లు అంగీకరించింది. దీంతో ఆమెను, పుందమల్లికి చెందిన దినేష్‌ (31) ఇద్దరిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.  

కాగా.. దినేష్.. ధరణ్ కి మిత్రుడేనని దర్యాప్తులో తేలింది. స్నేహం పేరిట ఇంటికి వచ్చిన దినేష్... భవానితో పరిచయం ఏర్పరుచుకున్నాడు. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలో వీరి బంధానికి ధరణ్ వారికి అడ్డుగా తోచాడు. దీంతో.. పథకం ప్రకారం ముందుగా.. పురుగుల మందు కలిపిన ఆహారం తినిపించింది. అనంతరం గొంతు నులిమి హత్య చేసింది. తొలుత అందరూ ధరణ్ ది ఆత్మహత్య అనే అనుకున్నారు. అయితే.. పోస్టుమార్టం రిపోర్టులో అసలు నిజం బయటపడటంతో.. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.