ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఓ మహిళ తన భర్తను చంపేసి కరోనా వైరస్ కారణంగా మరణించాడని బుకాయించింది. ప్రియుడి మోజులో ఆమె తన భర్తను చంపింది. అయితే, పోస్టుమార్టం నివేదికలో అసలు విషయం బయటపడింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

శరత్ దాస్ (46) తన భార్య అనిత (30)తో కలిసి ఢిల్లీలోని అశోక్ విహార్ లో నివాసం ఉంటున్నాడు. మే 2వ తేదీన శరత్ నిద్ర లేవలేదు. దాంతో తన భర్త కరోనా వైరస్ తో మరణించాడని అనిత ఇరుగుపొరుగువారికి చెప్పింది. అయితే, వారికి అనుమానం వచ్చింది. దాంతో అంత్యక్రియలను అడ్డుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. 

శరత్ ఊపిరి ఆడక మరణించాడని పోస్టుమార్టం నివేదికలో తేలింది. శరత్ కరోనా వైరస్  కారణంగా మరణిస్తే పాజిటివ్ వచ్చినట్లు తేలిన నివేదికలను చూపించాలని పోలీసులు అడిగారు. దాంతో తానే భర్తను హత్య చేసినట్లు అనిత అంగీకరించింది. 

తాను సంజయ్ అనే వ్యక్తిని ప్రేమించానని, ఆ విషయంపై తనతో భర్త గొడవ పడుతూ వస్తున్నాడని, దాంతో తన భర్త నిద్రిస్తున్న సమయంలో ప్రియుడు సంజయ్ తో కలిసి చంపానని చెప్పింది. దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు ఆమె తెలిపింది.