న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 38 ఏళ్ల వయస్సు గల మహిళ తన భర్తను అత్యంత కిరాతకంగా హత్య చేసింది. భర్తకు మత్తు మందు ఇచ్చి, అతన్ని చంపేసి, శవాన్ని ఎనిమిది ముక్కలు చేసింది. మొండేన్ని ఇంట్లో పాతిపెట్టింది. అతని తలను కాలువలో పడేసింది. 

ప్రేమికుల రోజు జరిగిన ఈ హత్య సంఘటన గత వారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు అనుమానం వచ్చి అమృత విహార్ లోని మహిళ ఇంట్లో సోదాలు చేశారు. అనుమానం వచ్చి తవ్వి చూడగా ఆమె భర్త మొండెం బయటపడింది.

2006లో పాతికేళ్ల సునీత 50 ఏళ్ల వయస్సు గల రాజేష్ ను విావహం చేసికుంది. నిరుడు వారు ఇల్లు మారారు.  దాంతో సమస్య ప్రారంభమైంది. పొరుగున ఉన్న యువకుడితో సునీత స్నేహంతో రాజేష్ కు అనుమానం వచ్చింది. 

ఇరువురి మధ్య గొడవలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. భర్తను వదిలించుకోవడానికి సునీత పక్కా ప్లాన్ వేసింది. భర్తను చంపడానికి టీవీ షోలు చూడడం ప్రారంభించింది. కుమారుడిని పొరుగున్న ఉన్న ఇంటికి పంపించి వేసింది. భర్తకు మత్తు మందు కలిపిన డ్రింక్ ఇచ్చింది. అతను స్పృహ కోల్పోగానే గొంతు నులిమింది. ఆ తర్వాత శవాన్ని ముక్కలుగా నరికింది. 

దాదాపు రెండు గంటల పాటు కష్టపడి శవాన్ని ఎనిమిది ముక్కలు చేసింది. తన గదికి వెలుపల గుంత తవ్వింది. మొండెం ముక్కలను అందులో పాతిపెట్టింది. తలను ప్లాస్టిక్ సంచీలో పెట్టుకుని వెళ్లి కాలువలో పడేసింది. కాళ్లను మరో సంచీలో పెట్టుకుని వెళ్లి మరో చోట పడేసింది. 

రెండు రోజుల తర్వాత పోలీసు స్టేషన్ కు వెళ్లి తన భర్త కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. ఆ విషయంపై స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈలోగా అటు వెళ్తూ ఓ వ్యక్తి తలను చూశాడు. వెంటనే పోలీసులకు చెప్పాడు. దాంతో పోలీసులు తలను స్వాధీనం చేసుకున్నారు. అయితే, గుర్తు పట్టరానంతగా తల కుళ్లిపోయింది. 

గత వారం సునీత ఇంట్లోకి యజమాని వచ్చి చూశాడు. ఇంట్లో తవ్వి పూడ్చినట్లు కనిపించింది. ఆ విషయం గురించి అతను సునీతను ప్రశ్నించాడు. ఆమె సరైన సమాధానం ఇవ్వలేకపోయింది. అక్కడ కొద్దిగా మట్టిని కదిలించాడు. అతనికి మనిషి వేలు కనిపించింది. ఆ తర్వాత ఓ చేయి కనిపించింది. 

అతను పోలీసులకు సమాచారం అందించాడు. దాంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి సంఘటనా స్థలాన్ని సందర్శించారు. పోలీసులు సునీతను ప్రశ్నించారు. వారి ప్రశ్నలకు ఆమె పరస్పర విరుద్ధమైన సమాధానాలు ఇచ్చింది. పోలీసుల విచారణలో సునీత బోరున ఏడ్చి నేరాన్ని అంగీకరించింది. 

ఆ తర్వాత తాను తలను, కాళ్లను పడేసిన చోటును చూపించింది. ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు.  గత సంవత్సర కాలంగా భర్తతో తనకు ఏ విధమైన సంబంధం లేదని, గొడవలు జరుగుతూ వచ్చాయని, తాను విడాకుల కోసం తన మిత్రుడి సాయం అడిగానని, దాంతో రాజేష్ తనను తీవ్రంగా కొట్టాడని ఆమె వివరించింది. 

కొన్ని నెలల క్రితం సునీత తల్లి రాజేష్ ఇంటికి వచ్చింది. అది ఆయనకు ఇష్టం లేదు. వెంటనే ఇంటి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించాడు. ఆమెను స్టేషన్లో వదిలేస్తానని తీసుకుని వెళ్లాడు. కానీ ఆమె తన సొంత ఊరికి చేరుకోలేదు. తన తల్లి అదృశ్యం వెనక రాజేష్ హస్తం ఉందని సునీత అనుమానించింది. తన తల్లిని రాజేష్ చంపి ఉంటాడని ఆమె అనుమానించింది. దాంతో భర్తను చంపాలని నిర్ణయించుకుంది.