ఆమెకు అప్పటికే పెళ్లయ్యింది. అనుకోకుండా అనారోగ్యంతో భర్త ప్రాణాలు కోల్పోయాడు. భర్త చనిపోవడంతో తనకన్నా వయసులో పదేళ్లు చిన్నవాడిని రెండో పెళ్లి చేసుకుంది. అతనితో నైనా సవ్యంగా కాపురం చేసిందా అంటే.. అదీ లేదు. మరో వ్యక్తితో పరిచయం పెంచుకొని.. అతనితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అతనితో కలిసి రెండో భర్తను దారుణంగా హత్య చేసింది. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకోగా..  పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 తెన్‌కాశి సమీపంలోని గుత్తుకల్‌వలసు ప్రాంతానికి చెందిన తంగరాజ్‌ భార్య అభిరామి (33) బ్యూటీపార్లర్‌ నడుపుతోంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో తంగరాజ్‌ మృతిచెందాడు. ఇలావుండగా అభిరామి తెన్‌కాశి అరుణాచలపురానికి చెందిన కన్నన్‌ కుమారుడు కాళిరాజ్‌ (23)ను వివాహమాడింది. అయితే, 2018 సెప్టెంబరులో కాళిరాజ్‌ హఠాత్తుగా మాయమయ్యాడు. ఈ విషయమై కాళిరాజ్‌ తల్లి ఉమ అభిరామిని ప్రశ్నించగా, అతడు విదేశానికి వెళ్లినట్లు చెప్పడంతో అనుమానం వచ్చి, ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ క్రమంలో రెండున్నరేళ్ల తర్వాత ఈ కేసు మలుపు తిరిగింది. అభిరామి వ్యవహారంపై అనుమానం వచ్చిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ జరపగా కాళిరాజ్‌ను హత్య చేసినట్లు ఒప్పుకుంది. అదే ప్రాంతంలో వర్కుషాపు నడుపుతున్న మారిముత్తు (23) అనే ప్రియుడితో కలిసి భర్తను హతమార్చినట్లు గుర్తించారు. అంతేకాకుండా మృతదేహాన్ని ఇంట్లోనే పాతిపెట్టినట్లు తెలిసింది. దీంతో అస్థిపంజరాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపారు. దీనికి సంబంధించి అభిరామి, మారిముత్తుతోపాటు సహకరించిన మురుగేశన్‌ను పోలీసులు అరెస్టు చేశారు.