నవమాసాలు కడుపున మోసి పెంచిన తల్లే.. ఆ బాలుడి పట్ల నిర్దయగా ప్రవర్తించింది. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కొడుకును అతి కిరాతకంగా హత్య చేసింది. ఈ సంఘటన కేరళలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కేరళ పాలక్కడ్ లోని పూలక్కడ్ గ్రామానికి చెందిన షాహిదా అనే మహిళకు ముగ్గురు కుమారులు ఉన్నారు. ప్రస్తుతం ఆమె మూడు నెలల గర్భవతి కూడా. కాగా.. ఆదివారం ఆమె తన సొంత కొడుకు పట్ల కర్కశంగా ప్రవర్తించింది. తన మూడో  కుమారుడు అమిల్ ను ఇంట్లోని బాత్రూంలో హత్య చేసింది. అనంతరం ఆమె ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేసింది. దేవుడి పేరు  చెప్పి ఆమె ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. దేవుడికి తన కొడుకుని బలి ఇచ్చానని ఆమె చెప్పడం గమనార్హం.

షాహిదాను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. ఆమె మానసిక స్థితి పై స్థానికులను ఆరా తీస్తున్నారు. ఆమె అసలు కొడుకును ఎందుకు చంపాల్సి వచ్చిందనే విషయం మాత్రం తెలియరాలేదు.