ఓ మహిళ.. కట్టుకున్న భర్తను అతి కిరాతకంగా హత్య చేసింది. అనంతరం శవాన్ని ఇంట్లోనే పాతిపెట్టేసింది. ఇంట్లో నుంచి శవం కుల్లిన వాసన వచ్చే వారకు ఈ విషయం ఎవరికీ తెలియరాలేదు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

సేలం సెంజికోట ప్రాంతానికి చెందిన కూలీ కార్మికులు రాజగిరి, పూంగొడి దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుటుంబ సమస్యల కారణంగా పదేళ్లుగా భర్త, పిల్లలను వదలి పూంగొడి ఒంటరిగా జీవిస్తోంది. ఈ నేపథ్యంలో పిల్లల కోసం భార్యతో మాట్లాడి సమాధానపరచడంతో నాలుగు నెలల క్రితం పూంగొడి భర్త ఇంటికి వచ్చింది. 

18 రోజుల క్రితం పిల్లలు బంధువుల వివాహానికి వెళ్లడంతో ఇంట్లో ఉన్న ఇద్దరి మధ్య మళ్లీ గొడవ జరిగినట్టు సమాచారం. అనంతరం ఇంటికి తిరిగొచ్చిన పిల్లలు తండ్రి కనిపించకపోవడంతో తల్లిని అడుగగా, పనుల కోసం వేరే ఊరికి వెళ్లినట్టు తెలిపింది. అనంతరం బంధువుల ఇంటికి వెళ్తున్నానని చెప్పిన పూంగొడి ఇప్పటివరకు రాలేదు. అదే సమయంలో ఇంటి నుంచి దుర్వాసన వస్తుండడంతో అనుమానించిన చుట్టుపక్కల వారు సూరమంగళం పోలీసులకు సమాచారం అందించారు. 

పోలీసులు అక్కడకు చేరుకొని దుర్వాసన వస్తున్న ప్రాంతంలో తవ్వగా రాజగిరి మృతదేహం బయటపడింది. ఇరువురి మధ్య వాగ్వాదం ఏర్పడిన సమయంలో పూంగొడి భర్తపై దాడిచేయడంతో అతను మృతిచెందగా, ఇంటి వెనుక వైపున గుంత తీసి మృతదేహాన్ని పాతిపెట్టింది. ఆ ప్రాంతంలో ప్రతిరోజూ ఆమె క్రిమినాశిని మందును పిచికారీ చేస్తూ వారం రోజులుగా ఇంట్లోనే ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు పరారైన పూంగొడి కోసం గాలిస్తున్నారు.