బెడ్ పై మూత్రం పోశాడని బాలుడిని అతి కిరాతకంగా హతమార్చింది ఓ కసాయి మహిళ.

లక్నో: అమ్మ ప్రేమకు దూరమైన బాలుడి పట్ల అత్యంత కర్కశంగా వ్యవహరించింది ఓ కసాయి మహిళ. అమ్మలా ఆదరించకపోయినా పర్వాలేదు కనీసం ఓ మహిళలా కూడా వ్యవహరించలేదు. బెడ్ పై మూత్రం పోశాడని బాలుడిని అతి కిరాతకంగా హతమార్చింది. అంతేకాకుండా బాలుడిని ఎవరో కిడ్నాప్ చేశారంటూ నమ్మించే ప్రయత్నం చేసింది. చివరకు మహిళ పాపం పండి అసలు నిజం బయటపడింది. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఫ‌రూక్కాబాద్‌ కు చెందిన యశ్ ప్రతాప్(5) అనే బాలుడి తల్లి మూడేళ్ల క్రితమే చనిపోయింది. దీంతో అన్నీ తానై తండ్రే అతడి ఆలనా పాలనా చూస్తున్నాడు. అయితే రెండు రోజుల క్రితం తండ్రి పనిపై బయటకు వెళుతూ కొడుకును ఒంటరిగా ఇంట్లో వుంచలేక సమీప బంధువులు నీర‌జ్, శైలేంద్ర‌సింగ్‌ దంపతుల ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళాడు.

ఈ క్ర‌మంలో బాలుడు బాలుడు ఆడుకుంటూ బెడ్ రూంలోకి వెళ్లి బెడ్ పై మూత్రం పోశాడు. దీంతో కోపోద్రిక్తురాలయిన నీరజ్ బాలుడి పట్ల దారుణంగా వ్యవహరించింది. బాలుడి గొంతు నులిమి హతమార్చింది. ఇలా అమానవీయంగా వ్యవహరించడమే కాకుండా నిజాన్ని దాచే ప్రయత్నం చేసింది. గ్రామానికి స‌మీపంలో ఉన్న అట‌వీ ప్రాంతంలో మృత‌దేహాన్ని పూడ్చి పెట్టి తనకేమీ తెలియదన్నట్లు వ్యవహరించింది.

ఈ క్రమంలోనే ప్ర‌తాప్‌ను ఎవ‌రో కిడ్నాప్ చేశార‌ంటూ కొత్త నాటకాన్ని మొదలుపెట్టింది. దీంతో బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. సీసీటీవీ ఫుటేజీని ప‌రిశీలించ‌గా అసలు నిజం బయటపడింది. తానే ప్ర‌తాప్‌ను హ‌త్య చేసిన‌ట్లు నీర‌జ్ అంగీక‌రించింది. ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులు ప్ర‌తాప్ డెడ్‌బాడీని తిరిగి బ‌య‌ట‌కు తీసి పోస్టుమార్టం నిర్వహించారు.