అతనికి ఎప్పుడో పెళ్లి అయ్యింది. చెట్టంత ఎదిగిన నలుగురు కొడుకులు కూడా ఉన్నారు. వారికి పెళ్లిళ్లు అయ్యి కోడళ్లు కూడా ఇంటికి వచ్చారు. ఇలాంటి వయసులో అతని బుద్ధి వక్రించింది. కూతురుగా చూడాల్సిన కోడలిపై కన్నేశాడు. కొడుకు భార్య అనే ఇంగితం కూడా లేకుండా.. చిన్న కోడలితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. దీంతో.. అతని భార్య.. పెద్ద కోడలి సహాయంతో భర్తను చంపేసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. కోయిరానా గ్రామానికి చెందిన 55ఏళ్ల వ్యక్తికి నలుగురు కుమారులు. వీరిలో ఇద్దరికి కొన్నేళ్ల కింద వివాహం జరిగింది. వీరంతా ఒకే ఇంట్లో ఉంటూ.. ముంబయిలో కూలీ పనులు చేస్తున్నారు. కాగా.. ఇటీవల పెళ్లి అయిన ఇద్దరు కుమారులు భార్యలతో కలిసి అత్తారింట్లో ఉంటున్నారు.

మామ తరచూ ఇద్దరు కుమారుల దగ్గరికి వెళ్లెచ్చేవాడు. ఈ క్రమంలో చిన్న కోడలితో మామకు వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం తెలుసుకున్న భార్య, పెద్ద కోడలు.. ఆమెను పుట్టింటికి పంపించారు. దీంతో కోపం పెంచుకున్న మామ.. పెద్ద కోడలు, భార్యపై దాడి చేశాడు. కొద్ది రోజులుగా పెద్ద కోడలు మరో ఇంట్లో కిరాయికి ఉంటున్నారు.

కాగా, ఐదు రోజుల కిందట చిన్న కోడలిని పుట్టింటి నుంచి తన ఇంటికి రప్పించుకున్నాడు మామ. శనివారం రాత్రి ఆమెతో కలిసి ఉండగా ఆ ఇంటికి వచ్చిన భార్య, పెద్ద కోడలు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకిని చాకుతో గొంతు కోసి హత్య చేశారు. భయంతో బయటకు పరుగులు తీసిన చిన్న కోడలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి చూడగా.. సదరు వ్యక్తి రక్తపు మడుగులో పడి ఉన్నాడు. ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందారని వైద్యులు చెప్పారు. చిన్న కోడలి ఫిర్యాదు మేరకు.. అత్త, తోటి కోడలుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.