ముంబైలో దారుణం జరిగింది. తనతో సహజీవనం చేస్తున్న మహిళను అత్యంత కిరాతకంగా చంపి.. అనంతరం మృతదేహాన్ని బెడ్ కింద వున్న బాక్స్‌లో దాచి పరారయ్యాడు. రంగంలోకి దిగిన పోలీసులు ప్రియుడిని పట్టుకున్నారు.   

ముంబైలో ఓ వ్యక్తి తనతో సహజీవనం చేస్తున్న మహిళను హత్య చేసి తన డబుల్ కాట్ మంచానికి వున్న బాక్స్‌లో దాచాడు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని నలసోపరాలో ఈ ఘటన జరిగింది. ఫ్లాట్‌ను అద్దెకు తీసుకునే సమయంలో వీరిద్దరూ తమను పెళ్లయిన జంటగా పేర్కొన్నారు. 

మంగళవారం తెల్లవారుజామున మధ్యప్రదేశ్‌లోని నాగ్డా జంక్షన్ రైల్వే స్టేషన్‌లో నిందితుడు హార్డిక్ షా (30)ను ఈరోజు పోలీసులు అరెస్ట్ చేసి నలసోపరాకు తీసుకొచ్చారు. ఇతనిపై హత్యా నేరం నమోదు చేసిన పోలీసులు అతడిని వసాయ్ కోర్టులో హాజరుపరచనున్నారు. నలసోపరా (ఈస్ట్)లోని సీతా సదన్‌లోని అద్దె ఫ్లాట్‌లో తనతో సహజీవనం చేస్తున్న మేఘా తొర్వి (40)ని గొంతుకోసి హత్య చేసినట్లుగా అతనిపై ఆరోపణలు వున్నాయి. 

Also REad: ఛీ.. పిన్ని కొడుకుతో వివాహేతర సంబంధం.. రూ. 5 లక్షల సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించిన భార్య...

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సోమవారం కర్ణాటకలో వున్న మేఘా అత్త ..రియల్ ఎస్టేట్ ఏజెంట్ సంజీవ్ ఠాకూర్‌‌ను అప్రమత్తం చేయడంతో ఆయన పోలీసులను ఆశ్రయించాడు. హార్డిక్ .. మేఘాను హత్య చేసినట్లు తనకు ఫోన్ చేసి చెప్పాడని, ఆపై ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడని మృతురాలి అత్త ఠాకూర్‌కు చెప్పింది. దీంతో కంగారుపడిన సంజీవ్ హుటాహుటిన హార్డిక్ ఫ్లాట్‌కు చేరుకోగా.. బయటి నుంచి తాళం వేసి వుండటాన్ని గుర్తించారు. హార్డిక్ సెల్‌ఫోన్‌ కూడా స్పందించకపోవడంతో పాటు ఫ్లాట్ నుంచి దుర్వాసన వచ్చింది. అనంతరం దీనిపై పోలీసులకు సమాచారం అందడంతో వారు తలుపులు బద్ధలుకొట్టి లోపలికి వెళ్లారు. ఈ క్రమంలో బెడ్ బాక్స్‌లో మేఘా మృతదేహం వారికి కనిపించింది. ఆమె మెడపై గొంతు నులిమి చంపిన గుర్తులు వున్నాయి. 

20 రోజుల క్రితమే వీరు ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్నారని.. తమను తాము భార్యాభర్తలుగా పరిచయం చేసుకున్నారని ఠాకూర్ పోలీసులకు తెలిపాడు. స్థానిక మీరా రోడ్‌కు చెందిన హార్డిక్ నిరుద్యోగి.. అయితే మేఘా నర్సుగా పనిచేసింది. డబ్బు విషయంలో తరచూ వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే మేఘాను హతమార్చినట్లుగా హార్డిక్ నేరాన్ని అంగీకరించినట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు హార్డిక్‌ను ట్రాక్ చేయగా.. అతను పశ్చిమ్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్నట్లుగా గుర్తించారు. చివరికి నాగ్డా రైల్వే స్టేషన్‌లో అతనిని అదుపులోకి తీసుకున్నారు.