ఈటా: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఈటాలో ఓ ఇంట్లో ఐదుగురు మృతి చెందిన ఘటన మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఇద్దరు మైనర్ బాలురతో పాటు ఐదుగురు కుటుంబ సభ్యులు ఇంట్లో మరణించిన విషయాన్ని ఇటీవల పోలీసులు గుర్తించారు. నలుగురు కుటుంబ సభ్యులను ఇంటి కోడలు చంపేసి తాను ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. 

ఆహారంలో విషం కలిపి వారిని చంపి, తాను మణికట్టు కోసుకుని మహిళ ఆత్మహత్య చేసుకుంది. నలుగురు వ్యక్తుల శరీరాల్లో విషం ఉన్నట్లు ఫోరెన్సిక్ నివేదికలో తేలినట్లు పోలీసులు తెలిపారు. ఏడాది బాలుడిని ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు తేలింది. 

ఈటాలోని సింగార్ నగర్ లోని ఓ ఇంటిలో పోలీసులు ఏప్రిల్ 25వ తేదీన ఐదు మృతదేహాలను కనిపెట్టారు. ఐదుగురి శవాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులను రిటైర్డ్ ఆరోగ్య కార్యకర్త రాజేశ్వర్ ప్రసాద్ పచౌరి (80), ఆయన కోడలు దివ్య, ఆమె ఇద్దరు పిల్లలు, దివ్య సోదరి బుల్బుల్ లుగా గుర్తించారు.

ఇంటిలో వేర్వేరు చోట్ల శవాలు కనిపించాయి. ఇద్దరు పిల్లల శరీరాలపై గాయాలు చేసిన గుర్తులున్నాయి. రక్తమోడుతూ కనిపిచారు. దివ్య సోదరి మెడపై గాయం మరక ఉంది. సంఘటన స్థలంలో పోలీసులు టాయిలెట్ క్లీనర్, సుల్ఫాస్ ట్యాబెట్లు, బ్లేడ్సును స్వాధీనం చేసుకున్నారు. ఇంటిలో పాలకు సంబంధించిన నమూనాలను కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. 

ఇంట్లోకి ఇతరులు బలవంతంగా ప్రవేశించిన దాఖలాలేవీ ప్రాథమిక విచారణలో కనిపించలేదు. ఇంట్లోంచి ఏ విధమైన శబ్దాలు కూడా వినిపించకపోవడంతో పొరుగువారు కిటికీలోంచి తొంగి చూశారు. నేలపై ఓ శవం పడి ఉండడం వారికి కనిపించింది. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాలను దివ్య భర్తకు అప్పగించారు. అతను రూర్కీలోని ఫార్మాస్యూటికల్ కంపెనీలో పనిచేస్తాడు.