ఓ మహిళ వింత శిశువుకి జన్మనిచ్చింది.  కడుపులో ఉన్నంత వరకు కవల పిల్లలు పుడుతున్నారని ఆ దంపతులు ఎంతగానే  సంబరపడిపోయారు. కానీ తీరా చూస్తే... ఒక్క బాబు.. రెండు తలలు, మూడు చేతులతో జన్మించాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... విదిశ జిల్లాలోని గంజ్‌బసోడకు చెందిన 21 ఏళ్ల బబితకు ఏడాదిన్నర క్రితం వివాహమైంది. ఆమె తన తొలి కాన్పు కోసం ఆస్పత్రిలో చేరారు. అయితే అక్కడ ఆమె రెండు తలలు ఉన్న బాబుకు జన్మనిచ్చారు. 

ప్రస్తుతం తల్లి, బిడ్డలను ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. రెండు తలలు ఉన్నప్పటికీ.. ఆ బాబుకు ఒకటే గుండె ఉన్నట్టు విదిశ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఈ విధంగా పిల్లలు జన్మించడం అరుదైన ఘటన అని వైద్యులు పేర్కొన్నారు. అండాలు విడిపోకపోవడం వల్ల ఇలా జరుగుతుందని వైద్యులు తెలిపారు. కాగా, ఇలాంటి సంఘటనే 2016లో భోపాల్‌లో చోటుచేసుకుంది. రెండు తలలు, నాలుగు చేతులతో ఓ బాలుడు జన్మించాడు.