విధి ఆమె పట్ల ఆగ్రహించింది. పచ్చని కాపురం ముక్కలైపోయింది. భర్త, ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉన్న ఆమె జీవితం ఒక్కసారిగా చెల్లాచెదురైపోయింది. మనస్పర్థలతో భర్త వదిలేశాడు.. పుట్టింటికి చేరి.. పిల్లలే ప్రాణంగా బతుకుతున్న ఆమెకు మరో షాక్ తగిలింది. ప్రమాదం రూపంలో వచ్చిన మృత్యువు.. తన ఇద్దరు బిడ్డలను, కన్న తండ్రిని ఆమెకు దూరం చేసింది. ఈ ఘటనతో తట్టుకోలేకపోయిన మహిళ బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కాట్పాడి సమీపంలోని లత్తేరి గ్రామానికి చెందిన మోహన్‌రెడ్డి(60) బస్టాండ్‌లో బాణసంచా దుకాణం నడుపుతున్నాడు. ఇతనికి కుమార్తెలు విద్య(33), దివ్య ఉన్నారు. విద్యకు పదేళ్ల క్రితం నరేష్‌ అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. వీరికి తేజశ్వరన్‌(8), ధూనూజ్‌ మోహన్‌ (6) పిల్లలున్నారు.

కొంతకాలం క్రితం విద్య, నరేష్ లకు మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో.. ఆమెను భర్త వదిలేశాడు. ఈ క్రమంలో ఆమె పిల్లలతో సహా తండ్రి వద్దకు చేరింది. ఈ నెల 18న మోహన్‌రెడ్డి, మనమల్లు తేజేశ్వరన్, ధనూజ్‌మోహన్‌ బాణసంచా దుకాణంలో జరిగిన అగ్నిప్రమాదంలో మృతిచెందారు. భర్త వదిలి వెళ్లడం, తండ్రి, కుమారులు మృతిచెందడంతో జీవితంపై విరక్తి చెందిన విద్య బుధవారం తెల్లవారుజామున లత్తేరి రైల్వేస్టేషన్‌ సమీపంలో రైలు కిందపడి మృతిచెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.