ఔరంగాబాద్: మహారాష్ట్రలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. 17 ఏళ్ల దళిత బాలుడిపై, అతని తల్లిదండ్రులపై పదునైన ఆయుధాలతో దాడి చేశారు. ఆ బాలుడి అన్న ఓ మహిళతో కలిసి లేచిపోయాడు. దాంతో మహిళ తండ్రి, బాబాయ్ 17 ఏళ్ల బాలుడిపై దాడి చేసి చంపేశారు. ఔరంగాబాదులోని వైజాపూర్ తాహిసిల్ లో గల లఖ్డ ఖండాల గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. 

దళిత బాలుడి హత్యపై దళిత కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో రాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ స్పందించారు. బాలుడి హత్య సమగ్ర విచారణ జరిపి, 30 రోజుల లోగా చార్జిషీట్ దాఖలు చేయాలని ఆయన ఔరంగాబాద్ రూరల్ పోలీసులను ఆదేశించారు. 

భీమ్ రాజ్ గైక్వాడ్ అనే ఆ బాలుడిని హత్య చేసి, అతని తల్లిదండ్రులు బాలాసాహెబ్, ఆల్కాలపై దాడి చేసిన దేవిదాస్ దేవకర్, అతని సోదరుడు రోహిదాస్ ను పోలీసులు అరెస్టు చేశారు.  భీమ్ రాజ్ పెద్ద కొడుకు దేవకర్ 20 ఏళ్ల కూతురితో మార్చి 12వ తేదీన లేచిపోయినట్లు తెలుస్తోంది. 

దేవకర్ సోదరులను పోలీసులు సోమవారంనాడు కోర్టులో ప్రవేశపెట్టారు. వారికి కోర్టు నాలుగు రోజుల రిమాండ్ విధించింది. ప్రేమ జంట లేచిపోయిన తర్వాత యువతి సోదరుడు గైక్వాడ్ కుటుంబ సభ్యులను తీవ్రంగా హెచ్చరించాడు. దాంతో గైక్వాడ్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, పోలీసులు సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లనే హత్య జరిగినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.