కట్టుకున్న భార్య పట్ల ఓ వ్యక్తి కర్కశంగా ప్రవర్తించాడు. భార్యపై అతను అత్యాచారం చేయడంతోపాటు... తన కుటుంబసభ్యులతో కూడా అత్యాచారం చేయించాడు. ఈ దారుణ సంఘటన పంజాబ్ లో చోటుచేసుకుంది. కాగా... బాధితురాలి ఫిర్యాదు మేరకు ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పూర్తి వివరాల్లోకి వెళితే... మొహాలికి చెందిన ఓ వివాహిత భర్త అమర్‌జీత్‌ సింగ్‌ మత్తుమందుకు బానిస అయ్యాడు. ఈ క్రమంలో రోజూ ఆమెను హింసించేవాడు. దీనిని అలుసుగా తీసుకున్న అతడి తండ్రి అవతార్‌ సింగ్‌, బాబాయిలు(జస్పాల్‌ సింగ్‌, గుర్‌మెయిల్‌ సింగ్‌) కోడలి పట్ల మృగాళ్లలా ప్రవర్తించారు. కొడుకుతో పాటు బాధితురాలికి కూడా మత్తు ఇచ్చి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

ఈ విషయం బయటకు చెబితే... చంపేస్తామంటూ యువతిని బెదిరించారు. కొద్ది రోజులుగా నరకం అనుభవిస్తున్న ఆమె ఎలాగోలా ఆ రాక్షసుల నుంచి తప్పించుకొని పోలీసులను ఆశ్రయించింది. తన పుట్టింటి వారి సహాయంతో... పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారే తప్ప.. ఇప్పటి వరకు కేసులో ఒక్కరిని కూడా అరెస్టు చేయకపోవడం గమనార్హం. దీంతో.. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి.