జమ్ములో ఓ మహిళా డాక్టర్‌ను బాయ్‌ఫ్రెండ్ కత్తితో పొడిచి చంపేశాడు. అనంతరం తననూ అదే కత్తితో గాయపరుచుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం నిందితుడి పరిస్థితి విషమంగా ఉన్నది. 

న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్‌లో ఓ మహిళా డాక్టర్‌ను బాయ్‌ఫ్రెండ్ కత్తితో పొడిచి చంపేశాడు. ఆ తర్వాత తనను కత్తితో గాయపరుచుకుని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాడు. ఓ వ్యక్తిగత విషయంపై వారిద్దరూ గొడవపడ్డారు. ఆ తర్వాత కోపంలో కిచెన్‌లోని కత్తితో ఆ వైద్యురాలిని హతమార్చేశాడు. ఈ ఘటన జమ్ములో చోటుచేసుకుంది.

జమ్ములోని తల్లబ్ తిల్లోకు చెందిన సుమేధ శర్మ, పాంపోష్ కాలనీలో నివసించే జోహర్ గనాయ్ ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఇద్దరూ రిలేషన్‌లో ఉన్నారు. వారిద్దరూ డెంటల్ సర్జరీలో బ్యాచిలర్స్ పూర్తి చేశారు. ఎండీఎస్ కోసం సుమేధ శర్మ జమ్ము దాటి బయటకు వెళ్లారు. హోలీ పండుగను పురస్కరించుకుని మార్చి 7వ తేదీన ఆమె తిరిగి ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె తన బాయ్‌ఫ్రెండ్ వద్దకూ వెళ్లింది. 

అక్కడే వారిద్దరికీ గొడవ జరిగింది. ఆగ్రహంలో జోహర్ గనాయ్ కిచెన్ కత్తితో ఆమె కడుపులో పొడిచేశాడు. ఆమె నేలపై కూలిపోయింది. అనంతరం, అదే కత్తితో జోహర్ కూడా తన కడుపులో పొడుచుకున్నాడు. 

Also Read: బాత్రూమ్‌లో దంపతుల మృతదేహాలు.. హోలీ పార్టీ తర్వాత విగత జీవులై..!

జోహర్ బంధువు ఒకరు పోలీసుకు ఫోన్ చేశాడు. తన వ్యక్తిగత సమస్యలతో మరణిస్తున్నట్టు జోహర్ తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్టు చేసినట్టు వివరించాడు. దీంతో పోలీసులు వెంటనే జోహర్ ఇంటికి వెళ్లారు. జమ్ములో జానిపూర్‌లోని ఇంటి గేటుకు వేసి ఉన్న తాళం పగులగొట్టి లోపటికి వెళ్లారు. అప్పటికే రక్తపు మడుగులో సుమేధ కనిపించింది. నిందితుడి పొట్టలోనూ రక్తపు మరకలు ఉన్నాయి.

వారిద్దరినీ పోలీసులు హాస్పిటల్ తరలించారు. సుమేధ బతకలేకపోయింది. నిందితుడి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నది.