రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ శుక్రవారం కాన్పూర్ లో పర్యటించగా ప్రోటో కాల్ లో భాగంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిపివేశారు. ఈ ట్రాఫిక్ లో చిక్కుకునే ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది.   

కాన్పూర్: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉత్తరప్రదేశ్ పర్యటన ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఆయన శుక్రవారం రాత్రి కాన్పూర్ లో పర్యటించగా ప్రోటో కాల్ లో భాగంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిపివేశారు. ఈ ట్రాఫిక్ లో చిక్కుకునే ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది.

వివరాల్లోకి వెళితే... కాన్పూర్ కు చెందిన వందన మిశ్రా(50) అఖిలభారత పరిశ్రమల సమాఖ్య కాన్పూర్‌ చాప్టర్‌ మహిళా విభాగం అధ్యక్షురాలు. ఇటీవల ఈమె కరోనాబారిన పడి కోలుకున్నారు. అయితే శుక్రవారం ఆమె ఆరోగ్య పరిస్థితి మరోసారి క్షీణించడంతో కుటుంబసభ్యులు హాస్పిటల్ కు తీసుకువెళ్ళడానికి బయలుదేరారు.

 వీరి వాహనం నగరంలోని గోవింద్‌పురీ వంతెన మార్గంలో వెళుతుండగా ఇదే సమయంలో ఈ దారిలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ వెళుతున్నారు. దీంతో ట్రాఫిన్ ను నిలిపివేశారు. దీంతో వందన పరిస్థితి మరింత విషమంగా మారింది. రాష్ట్రపతి వెళ్లిపోయాక వందనను హాస్పిటల్ కు తీసుకెళ్లగా అప్పటికే ఆమె మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. 

ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం స్పందించింది. ఘటనకు కారకులంటూ ఒక సబ్‌ ఇన్‌స్పెక్టర్, ముగ్గురు హెడ్‌ కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేసినట్లు కాన్పూర్‌ అదనపు డెప్యూటీ కమిషనర్‌ అసీమ్‌ అరుణ్‌ చెప్పారు. ఈ ఘటనపై చాలా బాధాకరమంటూ సిపి క్షమాపణలు చెప్పారు.