కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడాల్సిన పెద్ద దారి తప్పాడు. భార్య, పిల్లలను పట్టించుకోకుండా.. మరో మహిళ మోజులో పడిపోయాడు. ఇంటి బాధ్యతలు పట్టించుకోకుండా తిరగడం మొదలుపెట్టాడు. దీంతో.. భర్త చేసిన పనికి ఆ భార్య తట్టుకోలేకపోయింది. తన ఇద్దరు పిల్లలతో కలిసి బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కర్ణాటక రాష్ట్రం బాగలకోటె జిల్లా బాదామి తాలూకా హళకుర్కి గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి పెళ్లై  చాలా సంవత్సరాలు అవుతోంది. భార్య ఫక్కీరమ్మ(35), కుమారుడు నీలకంఠ(12), కుమార్తె కల్పన(10) ఉన్నారు. కాగా.. ఇటీవల సదరు వ్యక్తి మరో మహిళ మోజులో పడిపోయాడు. ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. దీంతో.. ఫక్కీరమ్మ, నీలకంఠ, కల్పన అనే ముగ్గురు ఇంటి నుంచి గుడికి వెళ్లి అనంతరం ఇంటికి తిరిగి వస్తూ ఓ పొలంలో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు.


భార్యాపిల్లలు కనిపించకపోవడం భర్త గాలించినా ఆచూకీ దొరకలేదు. మృతదేహాలు నీటి మీద తేలడంతో స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. భర్త వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని ఫక్కీరమ్మను హింసించేవాడని, అందువల్లే ఆమె ప్రాణాలు తీసుకుందని సమాచారం. కొడుకు నీలకంఠ పుట్టుమూగ. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకొన్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న బాదామి పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.