ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టిన ఆ యువతికి ఊహించని షాక్ తగిలింది. భర్తతో కలకాలం సంతోషంగా గడపాలన్న ఆమె కలలన్నీ కళ్లలైపోయాయి. తాను ఇష్టపడి పెళ్లి చేసుకున్న భర్త.. మరో స్త్రీ మోజులో ఉన్నాడని తెలిసి షాకైంది. భర్త అక్రమ సంబంధం గురించి తెలుసుకున్న నవ వధువు ఆత్మహత్యతో ప్రాణాలు విడిచింది. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తంజావూరు సమీపంలోని తిరుకాట్టుపల్లి వేలంగుడికి చెందిన కల్యాణ సుందరంకి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇటీవల చిన్న కుమార్తె భువనేశ్వరి(25) వివాహం రంగరాజ్(30) తో జరిపించారు. వీరి పెళ్లి జరిగిన సంవత్సరం కూడా పూర్తి కాలేదు.

ఈ దంపతులు తిరుకాట్టుపల్లిలో కాపురం ఉంటున్నారు. మంగళవారం ఇంట్లో భువనేశ్వరి ఉరేసుకున్న స్థితిలో శవమై వేలాడుతూ కనిపించింది. తన కుమార్తె మృతి పట్ల అనుమానం ఉన్నట్లు కల్యాణసుందరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.


వివాహమైనప్పటి నుంచి అల్లుడు రంగరాజ్, అతని తండ్రి కలియమూర్తి, తల్లి సుమతి వరకట్నం కోసం వేధింపులకు గురి చేశారని, అల్లుడికి వేరొక యువతితో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలిపారు. నిందితులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసుస్టేషన్‌ ఎదుట బంధువులు బైఠాయించి ఆందోళన జరిపారు. దీని గురించి తిరువయ్యారు డీఎస్పీ సబీవుల్లా, ఇన్‌స్పెక్టర్‌ శ్రీదేవి కేసు నమోదు చేసి విచారణ జరిపారు. రంగరాజ్‌ను పోలీసులు అరెస్టు చేసి భువనేశ్వరి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపారు