అగర్తల: త్రిపురలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం కొనసాగిస్తోందనే ఆరోపణపై ఓ మహిళను గ్రామస్తులు తీవ్రంగా అవమానించారు. ఆమెను ఘోరంగా హింసించి, దారుణంగా అవమానించారు. దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన మహిళ ఆత్మహత్య చేసుకుంది.

మహిళను అవమానించిన ఘటనను త్రిపుర హైకోర్టు సూమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది. కోర్టు సూమోటోగా తీసుకున్న మర్నాడే మహిళ ఆత్మహత్య చేసుకుంది. త్రిపురలోని బెతగ గ్రామానికి చెందిన ఓ మహిళ అదే ప్రాంతానికి చెందిన వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని గ్రామస్తులకు తెలిసింది. 

ఆ విషయంపై మంగళవారంనాడు పంచాయతీ జరిగింది. ఆ మహిళ వివాహేతర సంబంధానికి సంబంధించిన వీడియోను భారీ స్క్రీన్ మీద ప్రదర్శించారు. వీడియో బయటకు రావడంతో మహిళ తీవ్ర మనస్తాపానికి గురైంది. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని ఇంటికి వెళ్లింది. 

అయితే గ్రామస్తులు ఆమెను వదిలిపెట్టలేదు. ఆమెను బయటకు లాగి మెడలో చెప్పుల దండ వేశారు. గుండు కొట్టించారు. ఊరంతా నగ్నంగా తిప్పారు. ఆ ఘటనపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని ఏడుగురిని అరెస్టు చేశారు. 

ఆ కేసును సూమోటోగా స్వీకరించిన హైకోర్టు ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేసింది. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని ఆదేశించిదంది. ఆ మర్నాడే మహిళ ఆత్మహత్య చేసుకుంది.