ఆమెకు చేపల కూరంటే చాలా ఇష్టం. అందుకే.. రెండు కేజీలు తెచ్చి మరీ అద్భుతంగా వండింది. తాను తన భర్త, పిల్లలతో కలిసి ఆ చేపల కూరను ఆస్వాదిస్తూ తినాలని అనుకుంది. కానీ డ్యామిట్ కథ అడ్డం తిరిగింది. వండిన ఆమెకు కనీసం ఒక్క ముక్క కూడా ఉంచకుండా.. కూర మొత్తం భర్త, పిల్లలు తినేశారు. అంతే.. ఆ ఘటన ఆమె తట్టుకోలేకపోపోయింది. బాధతో ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన బిహార్ రాష్ట్రంలో చోటుచేసుకోగా..   పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

బిహార్ లోని బగల్ పూర్ ప్రాంతానికి చెందిన కుందన్ మండల్ అనే వ్యక్తి తన కుటుంబం కోసం రెండు కేజీల చేపలు కొనుగోలు చేశాడు. వాళ్ల కుటుంబంలో నలుగురు పెద్దలు, నలుగురు పిల్లలు ఉన్నారు. కాగా.. కుందన్ భార్య సారా దేవి ఆ చేపలతో అద్భుతంగా కూర వండింది. దానిని తన భర్త, పిల్లలతో కలిసి తినాలని ఆమె ఆశపడింది.

కాగా.. ఆమె పనిమీద బయటకు వెళ్లి వచ్చేసరికి ఇంట్లో అందరూ భోజనం చేసేశారు. ఆమె తిందామని  చూసేసరికి గిన్నెలో కొంచెం కూడా చేపల కూర లేదు. దీంతో.. ఆమె చాలా బాధపడింది. ఈ విషయంలో భర్త కుందన్ తో సారాకి తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

గొడవ అనంతరం కుందన్ పొలానికి వెళ్లగా.. సారా ఇంట్లో ఉన్న విషయం తాగేసింది. గమనించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. కాగా.. ఆస్పత్రిలో చికిత్స అందిస్తుండగానే.. పరిస్థితి విషమించి ఆమె ప్రాణాలు కోల్పోయింది.

కాగా.. చేపల కూర తనకు మిగల్చకపోవడంతో తన భార్య చాలా ఆవేదన చెందిందని.. అందుకే ఆత్మహత్య చేసుకుందని కుందన్ పోలీసులకు తెలిపాడు. గతంలో ఎప్పుడూ ఆమె ఆత్మహత్యాయత్నం కూడా చేయలేదని చెప్పాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.