కైలాష్ మానస సరోవర్‌లకు వెళ్లే దారిలో ఉన్న నిషేధిత ప్రాంతం గుంజికి వెళ్లిన ఓ మహిళ తాను సాక్షాత్తు పార్వతీ దేవి అవతారాన్ని అని చెప్పారు. తాను మరింత ముందుకు వెళ్లి శివుడిని పెళ్లి చేసుకుంటానని అన్నారు. ఆ నిషేధిత ప్రాంతం నుంచి వెనక్కి ఆమెను వెనక్కి తీసుకురావడానికి వెళ్లిన పోలీసులను ఆమె బెదిరించారు. వెనక్కి రావాలని తనను ఒత్తిడి చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించింది.
న్యూఢిల్లీ: హిమాలయాల్లోని మానస సరోవరం పవిత్రమైన ప్రాంతంగా భావిస్తారు. మానస సరోవరానికి సమీపంగానే కైలాస పర్వతం ఉన్నది. ముఖ్యంగా శైవ భక్తులు ఈ పర్వతాలను పవిత్రంగా భావిస్తారు. తాజాగా, మానస సరోవరం దారిలో గుంజి అనే ఓ గ్రామం ఉన్నది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ మానస సరోవరం దారిలో షాకింగ్ వ్యాఖ్యలు చేసింది. నిషేధిత ప్రాంతం నాభిదాంగ్ ఏరియాలో ఓ మహిళ తాను పార్వతి దేవీ అవతారాన్ని అని చెప్పుకుంది. అంతేకాదు. తాను శివుడిని పెళ్లి చేసుకుంటానని పేర్కొంది. అందుకే తాను ఆ నిషేధిత ప్రాంతాన్ని వదిలి వచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. దీంతో పోలీసులు తలలు పట్టుకున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని అలీగంజ్‌కు చెందిన హర్మిందర్ కౌర్ ఉత్తరాఖండ్‌లో హిమాలయాలనూ కలుపుకుని ఉన్న పితోరగఢ్ జిల్లాకు వెళ్లింది. అక్కడి నుంచి 15 రోజుల అనుమతి తీసుకుని హర్మిందర్ కౌర్ తన తల్లితోపాటు గుంజికి వెళ్లింది. మే 25వ తేదీన ఆమె అనుమతి ఎక్స్‌పైర్ అయింది. అయినా అక్కడి నుంచి తాను వెనక్కి రానని చెప్పేసింది. దీంతో పోలీసుల మైండ్ బ్లాక్ అయింది.
తాను సాక్షాత్తు పార్వతీ దేవి అవతారాన్ని అని చెప్పింది. తాను ఇక్కడే ఉండి శివుడిని పెళ్లి చేసుకుంటానని వివరించింది. దీంతో పోలీసులకు ఒక్కసారిగా మతి పోయినంత పని అయింది. అవేమీ కుదరవని.. అనుమతి అయిపోయింది కాబట్టి.. గుంజి నుంచి తిరిగి దార్చులాకు వెళ్లిపోయవాల్సిందేనని పోలీసులు స్పష్టం చేశారు. కానీ, ఆమె ససేమిరా అన్నది.
తాను గుంజి విడిచేదే లేదని, తనను బలవంతపెడితే.. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. దీంతో పోలీసులు వెనక్కి తగ్గక తప్పలేదని పితోరాగఢ్ ఎస్పీ లోకేంద్ర సింగ్ వివరించారు. ఆ తర్వాత ఇద్దరు ఎస్‌ఐలు, ఒక ఇన్‌స్పెక్టర్‌లతో కూడిన బృందం ఆమెను గుంజి నుంచి వెనక్కి తేవడానికి వెళ్లారు. కానీ, వారు కూడా ఆమెను వెనక్కి తీసుకురాలేకపోయారు. దీంతో తాము 12 మందితో కూడిన పోలీసు బృందాన్ని అక్కడికి పంపాలని నిర్ణయించుకున్నట్టు ఎస్పీ వివరించారు. ఆ బృందం ఆమెను వెనక్కి తీసుకువస్తుందని తెలిపారు.
ఆమె మానసిక దౌర్భల్యంతో ఉన్నట్టు అనుమానిస్తున్నారు. అందుకే ఆమె పార్వతీ దేవి అవతారాన్ని అని, శివుడిని పెళ్లి చేసుకుంటాననే మాటలు మాట్లాడుతున్నదని పోలీసువర్గాలు తెలిపాయి. కైలాష్, మానస సరోవర్ దారిలో గుంజి అనే ప్రాంతం ఉంటుంది. ఈ ప్రాంతాన్ని భారత్‌తోపాటు నేపాల్ కూడా తమదేనని వాదించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో గుంజి సహా మరికొన్ని ప్రాంతాలు నిషేధితమైనవిగా ఉన్నాయి.
