చెన్నై: మహిళ ఆత్మాహుతిని అడ్డుకోకుండా వీడియో చిత్రీకరించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

తమిళనాడు రాష్ట్రంలోని దిండుగల్ జిల్లా కొడైకెనాల్ సమీపంలో మాలతి అనే మహిళ ఆత్మాహుతి చేసుకొన్న విషయం తెలిసిందే. మహిళ ఆత్మాహుతి  చేసుకొంటున్న సమయంలో అడ్డుకోకుండా ఆ దృశ్యాలను తన మొబైల్ లో చిత్రీకరించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  ఈ విషయం పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో కొడైకెనాల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. మహిళ ఆత్మాహత్యాయత్నం చేసిన సమయంలో అడ్డుకోకుండా వీడియో తీసిన  శరవణ్ ను బుధవారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు. 

ఆత్మాహుతి చేసుకొన్న మహిళతో సతీష్ అనే డ్రైవర్ కాపురం చేశాడు. వీరికి బిడ్డ పుట్టిన తర్వాత మరో పెళ్లి చేసుకోవడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మాహత్యాయత్నం దృశ్యాలను రికార్డు చేసిన శరవణ్ సోదరుడు సతీష్ కారణంగానే ఆమె మృతి చెందినట్టుగా పోలీసులు గుర్తించారు. పెళ్లి చేసుకొని మోసం చేసింది సతీష్ గా పోలీసులు గుర్తించి అతడిని అరెస్ట్ చేశారు. 

మృతి చెందిన మహిళను మాలతిగా గుర్తించారు. మాలతి ఆత్మహత్యకు కారణమైన సతీష్ తో పాటు సోదరుడు శరవణ్ కుమార్ ను కూడ పోలీసులు అరెస్ట్ చేశారు.