చాలా మంది ప్రేమికులు.. వారి ప్రేమ కోసం ప్రాణాలు ఇస్తారు. మరి కొందురు ప్రాణాలు తీస్తారు. ఏది ఏమైనా తమ ప్రేమను బ్రతికించుకోవాలని అనుకుంటారు. ఓ యువతి కూడా అదే చేసింది. కాకపోతే ఇక్కడ ఆమె ఎవరి ప్రాణాలు తీయలేదు.. తన ప్రాణం తీసుకోలేదు. అయితే... జైల్లో ఉన్న తన ప్రియుడు కోసం రోజు అక్కడికవ వెళ్లేది. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఖైదీగా ఉన్న తన ప్రియుడి కోసం సిబ్బందిని పక్కదారి పట్టించి, ఓ మహిళ జైలు లోపలికి వెళ్లేది.. గంటలకొద్దీ కాలక్షేపం చేసేది.. తాను ఓ స్వచ్ఛందసంస్థ వాలంటీర్‌గా నమ్మబలకడంతో ఆమెను అధికారులు అనుమతించేవారు. ఇలా కొద్దిరోజులు గడిచాక విషయం బయటపడింది. 

ఇదంతా ఎంతో కట్టుదిట్టమైన భద్రత ఉన్న తిహార్‌ జైలులో చోటు చేసుకోవడంతో ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణిస్తూ విచారణ చేపట్టారు. జైలులో శిక్ష అనుభవిస్తున్న ఆమె ప్రియుడు హేమంత్‌ దీనికి పథకం రచించినట్లు అనుమానిస్తున్నారు. 

ఆమెతో స్నేహంగా ఉండే జైలు అధికారి ఒకరి పాత్రపైనా విచారణ చేపట్టారు. ఆమె మాటలను సిబ్బంది ఎలా విశ్వసించారన్న విషయమై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇది తీవ్రమైన నిర్లక్ష్యమని, విచారణ కమిటీ నివేదిక రాగానే కఠిన చర్యలు చేపడతామని జైళ్ల ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.