ఒకరికి తెలీకుండా మరొకరిని రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. సరిపోలేదంటూ.. ఆ ఇద్దరికీ తెలికుండా మరో యువతిని మూడో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. కానీ... విషయం తెలిసిన అతని భార్యలు ఊరుకుంటారా..? అందుకే అతనికి ఊహించని షాక్ ఇచ్చారు. నడిరోడ్డు మీదే భర్తను చితకబాదారు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు జిల్లా సలూరు సమీపంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.... సూలూరు సమీపంలోని రంగ అరవింద దినేష్(26) రాశిపురంలోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. 2016లో తిరుప్పూర్ గణపతిపాళయానికి చెందిన రాజశేఖర్ కుమార్తె ప్రియదర్శినితో వివాహం జరిపించారు. వివాహం జరిగిన 15 రోజులకే భార్యభర్తల మధ్య విభేదాలు తలెత్తాయి. భార్యను దారుణంగా హింసించడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది.

దీంతో మొదటి పెళ్లిని దాచి గత ఏప్రిల్ లో అనుప్రియ అనే యువతినతి రెండో వివాహం చేసుకున్నాడు. అయితే... రెండో భార్య అనుప్రియతో కూడా దినేష్ కి తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అనుప్రియను కూడా దినేష్ వేధించేవాడు. అతని వేధింపులు తట్టుకోలేక ఆమెకూడా పుట్టింటికి చేరింది. ఇద్దరు భార్యలు పుట్టింటికి చేరడంతో... మూడో పెళ్లికి సిద్ధపడ్డాడు.

ఈ విషయం అతని ఇద్దరు భార్యలకు తెలిసింది. దీంతో ఇద్దరూ కోపంతో ఊగిపోయారు. అతని  ఇంటి దగ్గరకు వెళ్లి... ఇంట్లో నుంచి బయటకు లాగేశారు. అనంతరం నడిరోడ్డుపై చితకబాదారు. ఇద్దరు భార్యలను మోసం చేసి వివాహం చేసుకోవడంతో పాటు, మూడవ వివాహానికి కూడా దినేష్‌ సిద్ధమయ్యాడని, అతనిపై కఠిన చర్యలు చేపట్టాలని ఇద్దరు భార్యలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు.