ఇప్పటి వరకు అమ్మాయిని అబ్బాయి లేవదీసుకుపోయి పెళ్లి చేసుకున్న ఘటనలు చూశాం. కానీ విచిత్రంగా ఓ మహిళ బాలికను లేపుకెళ్లి వివాహం చేసుకుని జైలు పాలైంది.

వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌ రాష్ట్రం బుధే బాలాజీ ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలిక సోమవారం కనిపించకుండా పోయింది. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసుల దర్యాప్తులో ఈ బాలికకు బంధువైన, శివ్‌పురి జిల్లాలో నివసిస్తున్న ఓ మహిళ కూడా కనిపించడం లేదని తేలింది. దీంతో శుక్రవారం పక్కా సమాచారంతో పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం విచారణలో అసలు విషయం వెలుగు చూసింది. సదరు మహిళ.. బాలికను లేవదీసుకుపోయి వివాహం చేసుకున్నట్లు తెలిసింది. అయితే బాలిక ఇష్ట ప్రకారమే తన వెంట వచ్చిందని, తాను ఎటువంటి బలవంతం చేయలేదని ఆ మహిళ తెలిపింది. దీంతో ఆమెపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఆ మహిళను అరెస్ట్ చేశారు.