ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. హోలీ వేడుకలు వద్దన్నందుకు ఓ అరవై యేళ్ల వృద్ధురాలిని కొట్టి చంపారు. అడ్డొచ్చిన ఆమె కుటుంబ సభ్యులు ఐదుగురిమీద దాడి చేసి, తీవ్రంగా గాయ పరిచారు. 

ఉత్తరప్రదేశ్, ఈటా నగర్ లోని మేవతి తోలా ప్రాంతంలో ఈ అమానుష ఘటన జరిగింది. తమ ఇంటి ముందు హోలీ ఆడుతున్న గుంపును అక్కడ్నుండి వెళ్లాల్సిందిగా, తమ ఇంటిముందు హోలీ ఆడొద్దు అని ఆ వృద్ధురాలు చెప్పింది. 

దీంతో కోపోద్రిక్తులైన ఆ గుంపు ఉదయం 10 గంటల సమయంలో వారింట్లోకి ప్రవేశించి కర్రలు, రాళ్లతో ఆమె మీద దాడి చేసి, కొట్టి చంపినట్లు అడిషనల్ పోలీసు సూపరింటెండెంట్ ప్రశాంత్ కుమార్ ప్రసాద్ తెలిపారు.

ఆమె కుటుంబ సభ్యులు ఆమెను కాపాడటానికి ప్రయత్నించగా, ఇద్దరు మహిళలు, ముగ్గురు పిల్లల మీద కూడా వారు దాడిచేసి తీవ్రంగా గాయపరిచారని పోలీసు అధికారి తెలిపారు.

ఎక్డిల్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో జరిగిన మరో సంఘటనలో, మద్యం సేవించిన ఓ యువకుడు మితిమీరిన వేగంతో ట్రాక్టర్ నడిపించాడు. దీంతో ఆరుగురు గాయపడ్డారు.
విద్యుత్ స్తంభానికి తగిలి ట్రాక్టర్ దెబ్బతింది. యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్చినట్లు పోలీసులు తెలిపారు.