ఓ మహిళ, ఇద్దరు పిల్లలు అతి దారుణంగా హత్యకు గురయ్యారు. వాళ్లు ఉంటున్న ఇంట్లోనే శవాలై తేలారు. అతి రాక్షసంగా హింసించి మరీ వారిని హత్య చేశారు. ఈ దారుణ సంఘటన దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలోని నిహాల్ విహార్ ప్రాంతానికి చెందిన ప్రీతి(29) భర్త, కొడుకు(9), కూతురు(5) తో కలిసి ఓ అద్దె ఇంట్లో నివసిస్తోంది. కాగా.. ఆదివారం ప్రీతి, ఆమె ఇద్దరు చిన్నారులు శవాలై కనిపించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

ప్రీతి పొట్టపై కత్తితో పొడిచిన గాయాలు ఉన్నాయని పోలీసులు చెప్పారు. ఇక ఆమె పెద్ద కుమారుడు రెండు చేతులు, కాళ్లు కట్టేసి మరీ హత్య చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. కాగా.. ప్రీతి భర్త ఆచూకీ మాత్రం తెలియరాలేదు.

వీరు నివసిస్తున్న ఇంటికి కొద్ది దూరంలోనే ప్రీతి తల్లిదండ్రులు కూడా ఉంటున్నారు. కాగా.. కూతురు, మనవడు, మనవరాలి మరణంతో వారు షాకయ్యారు. కన్నీరుమున్నీరుగా విలపించారు. తమ అల్లుడు పచ్చి తాగుబోతు అని.. ప్రతిరోజూ మద్యం సేవించి వచ్చి తన కూతురితో గొడవ పడుతూ ఉంటాడని వారు వాపోయారు.

అతనే తమ కూతురు, మనవడు, మనవరాలిని హత్య చేశాడంటూ వారు అనుమానిస్తున్నారు. వారి ఫిర్యాదు మేరకు ప్రీతి భర్తపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముందు నుంచి ఈ కేసులో ప్రీతి భర్తనే పోలీసులు ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్నారు. కాగా.. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.