ప్రధాని నరేంద్ర మోడీ ‘ఏక్ తరీఖ్ ఏక్ ఘంటా ఏక్ సాథ్’ అనే కార్యక్రమంలో ఆదివారం పాల్గొన్నారు. ఇందులో భాగంగా రెజ్లర్ అంకిత్ బయాన్ పురియాతో కలిసి, చీపురు పట్టుకొని పరిసరాలను శుభ్రం చేశారు. దీనిని ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు.

గాంధీ జయంతిని పురస్కరించుకొని ప్రధాని మోడీ పిలుపునిచ్చిన 'ఏక్ తరీఖ్ ఏక్ ఘంటా ఏక్ సాథ్' అనే మెగా పరిశుభ్రత కార్యక్రమం దేశ వ్యాప్తంగా ఆదివారం కొనసాగింది. అందులో భాగంగా స్వయంగా ప్రధాని చీపురు పట్టుకొని పరిసరాలను శుభ్రం చేశారు. రెజ్లర్ అంకిత్ బయాన్ పురియాతో కలిసి శ్రమదానం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన ట్విట్టర్ లో విడుదల చేశారు. 

‘‘ఈ రోజు దేశం స్వచ్ఛతపై దృష్టి సారిస్తున్న సమయంలో అంకిత్ బయ్యన్ పురియా, నేను కూడా అలాగే చేశాం’’ అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ‘‘కేవలం పరిశుభ్రతే కాకుండా ఫిట్ నెస్, శ్రేయస్సును కూడా మిక్స్ చేశాం. ఇదంతా ఆ స్వచ్ఛ, స్వస్థ్ భారత్ వైబ్ గురించే. ’’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు పలు అంశాలపై ముచ్చటించారు.

Scroll to load tweet…

కాగా.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా శ్రమదానంలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు చీపుర్లు పట్టుకుని 'స్వచ్ఛతే సేవ' ప్రచారంలో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవల మన్ కీ బాత్ ఎపిసోడ్ లో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. అక్టోబర్ ఒకటో తేదీన ఆదివారం ప్రజలందరూ స్వచ్ఛత కోసం ఒక గంట శ్రమదానం చేయాలని పిలుపునిచ్చారు. మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని ఆయనకు 'స్వచ్ఛాంజలి' నిర్వహించాలని సూచించారు. స్వచ్ఛభారత్ అనేది భాగస్వామ్య బాధ్యత అని, ప్రతి ప్రయత్నమూ ముఖ్యమని ప్రధాని పేర్కొన్నారు. 

మన్ కీ బాత్ 105వ ఎపిసోడ్ లో ఆయన మాట్లాడుతూ.. ‘‘ అక్టోబర్ 1న అంటే ఆదివారం ఉదయం 10 గంటలకు పరిశుభ్రతపై పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. పరిశుభ్రతకు సంబంధించిన ఈ ప్రచారంలో మీరు కూడా సమయాన్ని వెచ్చించి సహాయం చేయాలి. మీరు మీ వీధిలో, పార్కు, నది, సరస్సు లేదా మరేదైనా బహిరంగ ప్రదేశంలో కూడా ఈ పరిశుభ్రత ప్రచారంలో పాల్గొనవచ్చు.’’ అని పేర్కొన్నారు. 

ఈ కార్యక్రమానికి 'ఏక్ తారీఖ్, ఏక్ ఘంటా, ఏక్ సాథ్' అని పేరు పెట్టారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని చేపట్టిన భారీ పారిశుద్ధ్య కార్యక్రమం ఇది. 'స్వచ్ఛతా పఖ్వాడా- స్వచ్ఛతా హీ సేవ' 2023 ప్రచారానికి కొనసాగింపుగా ఈ కార్యక్రమం చేపట్టారు. అయితే ప్రధాని పిలుపు మేరకు రాజకీయ నాయకుల నుంచి విద్యార్థుల వరకు అన్ని వర్గాల ప్రజలు ఆదివారం గంటపాటు శ్రమదానంలో పాల్గొన్నారు.